YSRCP: పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు .. వైసీపీ ఏ నెగిటివ్ ప్రచారంతో బదనాం అవుతుందో.. ఇప్పుడదే నెగిటివ్ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వంపై మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. సిట్ తన చార్జిషీట్ లో తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టం చేసినప్పటికీ, జంతువుల కొవ్వు కలగలేదని తెగ ప్రచారం చేసుకుంటుంది. ఇక తాజాగా నెయ్యి సరఫరాకు సంబంధించి హెరిటేజ్ సంస్థపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. అయితే దానిపై పెద్దగా ప్రజల నుంచి స్పందన రాక పోవడంతో తిరుమలలో అన్నీ అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని కొత్త పాట అందుకుంది.. ఆ ప్రచార ఎపిసోడ్‌ని వైసీపీ సీనియర్ నేతలు బొత్సా సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి డైరెక్ట్ చేస్తూ.. తామే యాక్టర్లుగా ముందుండి నడిపిస్తుండటం ఇంట్రస్టింగ్‌గా తయారైంది.
పాజిటివ్ గా ఎంత ప్రయత్నించినా ఫలితం రానప్పుడు .. ఎవర్నైనా ఎదుటి వ్యక్తులు గుర్తించాలంటే ఖచ్చితంగా నెగిటివ్ యాటిడ్యూడ్‌తో హడావుడి చేయాలి.. అదే సమయంలో ఎక్కడైతే తాము అన్నీ కోల్పోయామో, అక్కడ తిరిగి పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ప్రస్తుత పాలకులపై నెగిటివ్ ప్రచారంతో దెబ్బ తీయాలి.. అలాంటి ప్రచారంలో ప్రస్తుతం వైసీపీ ఆరితేరిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.. దానికి తోడు వైసీపీ విమర్శదాడిని తిప్పికొట్టగలిలే సమర్ధులైన నేతలు అధికార పక్షంలో ఉన్నప్పటికీ, మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండటం కూడా వైసీపీకి కలిసి వస్తోందంటున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో టిటిడిని టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారు..చిన్న అవకాశం దొరికిన వదలటం లేదు..కులం మతం లేడా లేకుండా దాడి చేస్తున్నారు..కూటమి మొదటి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విచారణ ప్రారంభించింది..దీనికి బాధ్యుడిగా విజిలెన్స్ ఎస్పీ కరీముల్లాను నియమించింది. దీంతో అన్యమతస్తుడు విచారణ ఎలా చేస్తారని భూమన గ్యాంగ్ విమర్శించారు. తర్వాత తొక్కిసలాట ఇష్యూలో తన సన్నిహితుడు డాక్టర్ హారినాథ్‌రెడ్డి పాత్ర ఉందని బయటపడిన సమయంలో కొండపై గోశాలలో ఆవులు మరణించాయని నానా యాగీ చేశారు. దానిపై పెద్ద రచ్చనడిచింది. తర్వాత ఆరుబయట పూర్తి కాని విగ్రహం పై రాద్దాంతం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో పర్సనల్ గా టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడిని, తర్వాత అడిషనల్ ఇఓ వెంకయ్య చౌదరిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు..
వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి ఇష్యూ తో పాటు పరకామణి వివాదంలో మాజీ చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకరెడ్డిలతో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అప్పట్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అధికారులు విచారించారు. అప్పుడు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేశారు. కాని కల్తీ జరిగిందని సిట్ తెల్చినప్పటికి, జంతువుల కొవ్వు కలపలేదు కదా అనే వితండ వాదంతో మళ్లీ రచ్చ చేయాలని చూశారు. కల్తీ అనేక రసాయనాలతో చేసారని సిట్ స్పష్టంగా తెలిపింది. అయితే అవి కాదు మాకు కావాల్సింది, జంతువుల కొవ్వు కలపలేదు కదా అనే వితండవాదంతో రాష్ట వ్యాప్తంగా చెలరేగి పోయారు. దానిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం రెచ్చిపోయారు. నాన్ వెజ్ కలవలేదని చెప్తూ.. తర్వాత పక్కనవారు ప్రాంప్టింగ్ చేయడంతో యానిమల్ ఫాట్ కలవలేదు కదా అని తనదైన ఇంగ్లీషులో బుకాయించే ప్రయత్నం చేసి.. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.
ఇక మీడియా సమావేశాలలో తిరుమల ఉద్దరణ తామే చేసామని, ఏడు కొండలను సైతం శ్రీవారికి మేమే ఇచ్చామని విచిత్రమైన వాదన వినిపించారు. అయితే ఏడు కొండల వెంకన్న స్వామికి ఇవి తాము దానంగా ఇచ్చామన్న రీతిలో చెప్తి, తమ అవగాహనరాహిత్యంతో నవ్వులపాలయ్యారు. కల్తీ నెయ్యి ఇష్యూపై పెద్ద జియ్యంగర్ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకి లేఖ రాసినప్పుడు.. ఆ విషయాన్ని వదిలేసి వారికి వేతనాలు తామే పెంచామని పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నించారు. జియ్యంగార్రి వ్యవస్థ ఆలయ సంప్రదాయాలను పరిరక్షించడానికి, రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన పారంపర వ్యవస్థ. వారిని కూడా తామే ఉద్దరించామని, వారి ఖర్చులకు వేతనాలు ఇచ్చామని చెప్పుకోవడం గమనార్హం.
ఇప్పుడు హెరిటేజ్ డెయిరీ బినామి కంపెనీ పేరుతో నెయ్యి అత్యధిక రేటుకు సరఫరా చేస్తుందనే వివాదాన్ని బయటకు తెచ్చారు. అయితే నెయ్యి ధరపై మాట్లాడుతున్నప్పుడు మాత్రం గతంలో పాల ధరకు ఇప్పటికి పెరిగిన ధరలకు వ్యతాసం ఉందని, 147 శాతం పెరిగిందని, ఈవిషయాన్ని పట్టించుకోకుండా విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. హెరిటేజ్‌పై లేనిపోని ఆరోపణలతో తమ మీడియాలో ఉదరగొట్టారు. దాంతో హెరిటేజ్ తమ బ్రాండ్ నేమ్ ను దెబ్బతీసే విధంగా వ్యవహారించిన వారికి నోటీసులు పంపింది..దాంతో పాటు డిల్లీ హైకోర్టులో రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసింది. దానిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు హెరిటేజ్ ఫుడ్స్‌పై సాక్షి మీడియా ప్రచురించిన తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ నాణ్యత వివాదంలో హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందంటూ సాక్షి మీడియా ప్రసారం చేసిన నివేదికలు నిరాధారమని పేర్కొంటూ, హెరిటేజ్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావాపై కోర్టు ఈ చర్యలు తీసుకుంది.
అయినా వైసీపీ నేతల వైఖరి అలాగే కొనసాగుతోంది. వారు తమ అంతర్గత సంభాషణల్లో తమ ప్రభుత్వం చేసిన మేలు గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని..ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే విధంగా నెగిటివ్ ప్రచారం చేయడానికే ఫిక్స్ అయ్యారంట. అందులో భాగంగా కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల నుంచి దానిని మొదలు పెట్టినట్లు సమాచారం..అయితే తిరుపతిలో వారిని ఎదుర్కొని, ధీటుగా బదులిచ్చే నేతలు లేకపోవడం, ఉన్న టీడీపీ సీనియర్లు తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీకి ఎదురు లేకుండా పోతుందని అంటున్నారు..మొత్తం మీద… మీ మీదా బురద చల్లుతాము.. మీరు కడుక్కుంటే కడుక్కొండి లేక పోతే లేదు … మేము మాత్రం చల్లుతూనే ఉంటాం అన్న రీతిలో వైసీపీ వ్యవహరిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.చూడాలిమరి కూటమి తిరుపతి నేతలు వారి ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారో? లేదో?
Story by: Apparao, Big Tv