YS Jagan VS YS Sharmila: ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. అన్న, చెల్లిల మధ్య పోరు వారి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్, పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవీ సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంట. మొన్న ఆస్తుల వివాదంలో… నిన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైవీ ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల.. తన ఫోన్‌ను జగన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ.. వైవీని సాక్ష్యంగా చూపించారామె.. షర్మిల లెవనెత్తున్న అంశాలపై కౌంటర్ ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి తెగ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారంట. అటు మిగిలిన వైసీపీ పెద్దలు కూడా షర్మిల లేవనెత్తిన అంశాలపై ఎలా స్పందించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంట..
ఏపీలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటి వరకూ తెలంగాణకే పరిమితం అయిందనుకున్న తరుణంలో…కాదు అటు ఏపీలోను ట్యాపింగ్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీకి చెందిన రాజకీయనాయకుల ఫోన్ ట్యాప్ అయ్యాయని జరుగుతున్న ప్రచారం వేడి పుట్టిస్తున్న తరుణంలోనే షర్మిల తెరపైకి వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన అన్న, మాజీ సీఎం జగన్‌తో షర్మిల విభేదిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె జగన్‌ను ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు.. దాంతో అన్నాచెల్లెల్ల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది.
జగన్ ఓటమి తర్వాత కూడా టార్గెట్ చేస్తున్న షర్మిల
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన షర్మిల.. తర్వాత జగన్ పార్టీ 11 సీట్లకు పరిమితమై, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిన తర్వాత కూడా అదే రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఆమె తన అన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ సైతం తల్లివ విజయమ్మ, చెల్లి షర్మిలపై ఫిర్యాదులు చేశారు. ఆ వివాదం సద్దుమణగక ముందే షర్మిల ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు గుప్పించడంతో అన్నాచెల్లెల్ల మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తోందంటున్నారు.
రాజకీయంగా ఎదుగుదలను జీర్ణించుకోలేక కుట్రలు చేశారని షర్మిల కామెంట్స్
తన ఫోన్ ట్యాప్ చేసి రాజకీయంగా తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కుట్రలు చేశారని వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాటికీ వాస్తవమని, ఈ వ్యవహారం అంతా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషనేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఫ్లోలో కేసీఆర్, కేటీఆర్, జగన్‌లకు ఉన్న సాన్నిహిత్యాన్ని షర్మిల వివరించారు. వారు చాలా మంచి సత్సంబంధాలు మెయింటెయిన్ చేశారని, వారి అనుబంధం మందు రక్తం సంబంధం కూడా చిన్నబోయిందని సెటైర్లు వేశారు . ఒకరి కోసం ఒకరన్నట్లు మెలిగేవారని యద్దేవా చేశారు.
షర్మిల వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతున్న వైవీ సుబ్బారెడ్డి
పనిలో పనిగా ఆస్తుల వివాదం సమయంలో ప్రస్తావించిన వైవీ సుబ్బారెడ్డి పేరుని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా షర్మిల ఇరికించేశారు. తన ఫోన్ ట్యాపైన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డే తనతో చెప్పారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవీ సుబ్బారెడ్డి చెప్పారని..అవసరమైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని షర్మిల అన్నారు. ఇటీవల కాలంలో పదేపదే వైవీ సుబ్బారెడ్డి పేరును షర్మిల ప్రస్తావించడంతో వైసీపీ పెద్దలకు మింగుడు పడడంలేదంట. కీలకమైన అంశాలకు సంబంధించి తన పేరును ప్రస్తావించడం పట్ల అటు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే జగన్, షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపకాలపై రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలు ఏంటో వైవీ సుబ్బారెడ్డికి స్పష్టంగా తెలుసని షర్మిల చేప్పారు. జగన్ ఒత్తిడితోనే వైవీ సుబ్బారెడ్డి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని కూడా షర్మిల అంటున్నారు.
Also Read: బైరెడ్డి అడ్డాలో టీడీపీ ఎమ్మెల్యే కథ రివర్స్?
ఆస్తుల వివాదంలో వైవీ పేరు ప్రస్తవించిన షర్మిల
ఓవైపు ఆస్తుల వివాదంలో తన పేరు తెరపైకి తీసుకోవడంతోనే ఇబ్బందిపడిన వైవీ సుబ్బారెడ్డి…తాజా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు షర్మిల ప్రస్తావించడపట్ల వైవీ సుబ్బారెడ్డి మదన పడుతున్నారట. ఒకవైపు షర్మిల తనను సాక్షిగా పేర్కొంటూ నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే… మరోవైపు వైవీ సుబ్బారెడ్డి మాత్రం షర్మిల ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిల ఆరోపణలకు కౌంటర్‌గా ఎక్స్ లో స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాప్ చేయాల్సినవసరం అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
ఎక్స్ వేదికగా స్పందించిన రాజ్యసభ సభ్యుడు
గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వైవీ ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండగా, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని, అప్పుడు జగన్‌కి, షర్మిలకి సంబంధాలు ఇప్పటిలా లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్‌గారి ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్‌గారి ప్రభుత్వం ట్యాప్‌చేసిందా?లేదా? అన్నది తనకు తెలియదన్నారు. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నానని పేర్కొన్నరు. అన్నాచెల్లెల్ల గొడవలపై బయటకు మాట్లాడ లేకపోతున్న బాబాయ్ ఎక్స్ ఖాతాలో తన ఆవేదన వెల్లగక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా వైవీ సుబ్బారెడ్డి ఇద్దరి మధ్య ఇరుక్కుపోయారనే టాక్ నడుస్తోంది.
Story By Apparao, Bigtv