Bigg boss Sonia: ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. అయితే ఇంకొంతమంది స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని, అప్పటికే వివాహమై విడాకులైన వ్యక్తులను వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే తన అద్భుతమైన నటనతో జూనియర్ రమ్యకృష్ణ గా పేరు సొంతం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi sarathkumar ).. అప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకొని, పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఉన్న వ్యక్తిని వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది సోనియా ఆకుల. బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టి , తన ఆట తీరుతో అందర్నీ మెప్పించి, అనూహ్యంగా అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయింది.
వర్మ హీరోయిన్ గా గుర్తింపు..
హౌస్ లో ఉన్నన్ని రోజులు ఫైర్ బ్రాండ్ గా పేరు దక్కించుకుంది. ఇకపోతే సోనియా హీరోయిన్ గా కూడా నటించింది.’జార్జి రెడ్డి’చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఈమె, ఆ సినిమాలో హీరో చెల్లి పాత్ర చేసింది. దర్శకుడు ఆర్జీవి ఈమెకు లీడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాలో కూడా ఈమె నటించింది. అంతేకాదు ‘కరోనా వైరస్’ సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది. ఇక సోషల్ వర్కర్ గా బాధ్యతలు నెరవేరుస్తున్న ఈమెకు యష్ పాల్ (Yash Paul)అనే వ్యక్తి పరిచయమయ్యారట. అమెరికాలో ఉండే ఈయన సోనియాతో కలిసి కొన్ని ప్రాజెక్టులలో కూడా పనిచేసినట్లు సమాచారం.
రహస్యంగా నిశ్చితార్థం..
ఇద్దరి మధ్య పరిచయం రెండేళ్లకు పైగా ఉండడంతో, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇక తమకంటే కూడా సోనియా పెళ్లి విషయంలో వారి పేరెంట్స్ మరో అడుగు ముందుకేసినట్లు సమాచారం. ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు యష్. ఇకపోతే సడన్గా నవంబర్ 21న ఇద్దరు నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ సోషల్ మీడియా అకౌంట్స్ లో చూస్తే మాత్రం ఇద్దరి అకౌంట్స్ లో ఈ ఫోటోలు కనిపించడం లేదు. మరి ఈ ఫోటోలను ఎవరు షేర్ చేశారు? అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.
కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..
ఇక ఇతడు బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. యష్ కు ఆల్రెడీ వివాహమైంది. మొదటి భార్యతో ఆయన విడిపోయినట్లు సమాచారం. ఇక ఇప్పుడు సోనియాని రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే ఈ విషయాన్ని సోనియా అభిమానులు మాత్రం అంగీకరించడం లేదు. అప్పటికే వివాహమైన వ్యక్తితో పెళ్లేంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది.. ప్రేమకు ఏది అడ్డురాదు అంటూ తెలుపుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట బిగ్ బాస్ ఆఫర్ రావడంతో వాయిదా పడుతుందని భావించారు. కానీ సోనియా నాలుగు వారాలకే బయటకు రావడంతో యధావిధిగా పెళ్లి పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇక డిసెంబర్లో వీరి పెళ్లి జరగబోతోంది. ఇప్పటివరకు ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న సోనియా వివాహం తర్వాత కెరియర్ ను కొనసాగిస్తుందా లేక ఇంటికే పరిమితమవుతుందా అన్నది చూడాలి.