Bitcoin Scam : గత కొంత కాలంగా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. ‘పెట్టుబడి పెట్టండి, పెట్టినదానికి 5 నుంచి 10 రెట్లు ఎక్కువ లాభాలు పొందండి’ అంటూ టోకరా వేస్తున్నారు కేటుగాళ్లు. భారీ లాభాలు వస్తుందని ఆశించిన ప్రజలు, పెట్టుబడి పెట్టేసి, తీరా ‘పోయాం మోసం’ అని తెలుసుకునేలోగా మనం ఇచ్చిన డబ్బులతో ఉడాయిస్తున్నారు మోసగాళ్లు. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న 38 ఏళ్ల ఓ ప్రభుత్వ ఉద్యోగి ఈ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టిమెంట్ స్కామ్ బారిన పడ్డాడు. ఏకంగా రూ.51 లక్షలు పోగొట్టుకున్నాడు.
అసలు ఎప్పుడు, ఎక్కడ జరిగిందంటే? –
ఈ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టిమెంట్ స్కామ్ బాధితుడు గంజమ్ జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం సుందర్ఘర్ జిల్లాలోని బొనాయి ప్రాంతంలో పని చేస్తున్నాడు. అయితే ఫ్రాడ్స్టర్స్ GBE Transaction Group 603 పేరుతో ఈ స్కామ్‌ను ఆపరేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిట్ కాయిన్ లో ఇన్వెస్టిమెంట్ చేస్తే ఎక్కువ మొత్తంలో రిటర్న్ వస్తాయని నమ్మించి బాధిత ఇంజనీర్ దగ్గర సొమ్మును విడతల వారిగా దోచేశారు.
వాస్తవానికి ఈ ఏడాది మార్చి నెలలోనే బాధితుడికి స్కామర్స్ నుంచి వాట్సాప్ ద్వారా ఓ లింక్ వచ్చింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు అంటూ ఆ లింక్ సారాంశం. దీంతో ఇంజనీర్ గుడ్ రిటర్న్స్ వస్తాయని నమ్మి మొదటగా రూ.10 వేల ఇన్వెస్ట్ చేశాడు. అప్పుడు ఆ డబ్బులను స్కామర్స్ కాజేశారు. అయితే మళ్లీ ఫ్రాడస్టర్స్, డబ్బులు ఎక్కువగా పెట్టుబడి పెట్టండి కచ్చితంగా వస్తాని బాధిత ఇంజనీర్‌ను మళ్లీ నమ్మించారు. దాన్ని నమ్మి మళ్లీ అతడు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు.
అలా అతడు మార్చి నుంచి జులై మధ్యలో నాలుగు వివిధ బ్యాంకుల ద్వారా లాభాలు వస్తాయన్న ఆశతో విడతల వారీగా ఏకంగా రూ.51 లక్షలను ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే లాభాలు రావడం కాదు కదా, పెట్టిన పెట్టుబడి పోతుంటే చివరికి తాను మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు. చివరికి చేసేదేమి లేక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
“ఐపీసీ సెక్షన్స్ 419, 420, ఐటీ యాక్ట్ 66D కింద కేసు నమోదు చేశాం. డబ్బును ట్రేస్ చేసి స్కామర్స్ను పట్టుకునేందుకు బాధితుడు ఏఏ బ్యాంకుల ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడో వాటిని కూడా పరిశీలిస్తున్నాం.” అని రూర్కేలా సైబర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ పద్మావతి మిర్ధా చెప్పారు.
స్కామ్ బారిన పడకూడదంటే ఇలా చేయాలి –
వాట్సప్, ఇమెయిల్ లేదా ఇతర థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి వచ్చిన లింక్స్‌ను క్లిక్ చేసి వారి ఇచ్చిన సమాచారాన్ని నమ్మొద్దు.
ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు, నమ్మదగిన వాటిలోనే పెడుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి.
పర్సనల్ లేదా బ్యాంక్, ఫైనాన్షియల్ డీటెయిల్స్‌ను ఆన్లైన్లో షేర్ చేయకూడదు.
ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నమ్మదగ్గిన ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైసర్ను సంప్రదించాలి.
మీకు అనుమానంగా అనిపిస్తే, ముందుగానే ప్రారంభ దశలోనే పోలీసులకు రిపోర్ట్ చేయాలి.
ALSO READ : అతి పెద్ద నిఘానేత్రం మీ ఫోనే.. ఈ నిజాలు తెలిస్తే ఏమైపోతారో