Middle East Tensions: దేశంలో ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వినాయక చవితి మొదలు ధరలు ఎగబాకడం మొదలుపెట్టాయి. ఓ వైపు బంగారం-వెండి ధరలు పెరుగుదల, ఇప్పుడు క్రూడాయిల్ వంతైంది. అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం బ్రెంట్ ధర 110 డాలర్లకు టచ్ చేసింది. దీంతో వచ్చేనెల దేశంలో ఆయిల్ ధరలు పెంచడం ఖాయమని సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కావలంలో సౌదీ అరేబియాపై దాడులు చేయడం, హోర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు పేల్చివేయడం, ఈ విషయంలో అమెరికా సైలెంట్ కావడంతో చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. ఈ ఆందోళన నడుమ అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం ముడి చమురు ధరలు ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110.08 డాలర్లకు చేరింది. మే 20 తర్వాత ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. అటు అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్- డబ్ల్యూటీఐలో క్రూడ్ ధర 45 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 99 డాలర్లకు చేరువైంది.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ నివేదిక ప్రకారం.. దేశ భద్రతను కాపాడటానికి హోర్ముజ్‌పై నియంత్రణ సాధించడం తప్ప మా దేశానికి మరో మార్గం లేదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా ఆరెఫ్ అన్నారు. మిత్ర దేశాలకు హోర్ముజ్ ద్వారా సురక్షిత మార్గాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ కల్పించగలదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితికి అమెరికా కారణమని, దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు.
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధానికి ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తోడైంది. ఫలితంగా ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో ఈ ఏడాది బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 80 శాతం పెరిగాయి. గల్ఫ్ నుండి ముడి చమురు ఎగుమతులు పెరుగుతున్నాయని అంటోంది అమెరికా. శుద్ధి చేసిన ఉత్పత్తుల రవాణా పరిమితంగా ఉన్నప్పటికీ ఎగుమతులు యుద్ధానికి ముందు కంటే దాదాపు 80 శాతం వరకు పుంజుకున్నాయని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ తెలిపారు.
ALSO READ: ఖర్చు చేసేటప్పుడు కుటుంబం, స్నేహితులకు స్పష్టమైన హద్దులు పెట్టండి.. ఆర్థిక క్రమశిక్షణకు 7 టిప్స్
ఇదిలా ఉండగా యెమెన్ సైనిక శిక్షణా శిబిరంపై హౌతీలు జరిపిన దాడులు కూడా చమురు ధరలు పెరుగుదలకు కారణమైంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ ధరలు పెరగడం ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్‌పై ధర పెంచిన కేంద్రం, నేరుగా ఆయిల్‌పై ధరలు పెంచుతుందా? లేకుంటే దిగుమతులపై ట్యాక్స్ సడలిస్తుందా? అనేది చూడాలి.