Aadhaar update: ఆధార్ కార్డు, మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన డాక్యుమెంట్. బ్యాంకింగ్, విద్య, ఉద్యోగం, సబ్సిడీలు, ఇన్సూరెన్స్… ఇలా ఎక్కడ చూసినా ఆధార్ అవసరం. అలాంటి ఆధార్ కార్డు అప్‌డేట్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ అప్‌డేట్ సేవలు ఉచితం కావు. అక్టోబర్ 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
ఇప్పటివరకు చిరునామా మార్పు, ఫోన్ నంబర్ అప్‌డేట్ లేదా బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం తక్కువ ఛార్జీలతోనే సేవలు అందుబాటులో ఉండేవి. కానీ UIDAI కొత్త నిబంధనల ప్రకారం కొన్ని సర్వీసులకు రుసుములు పెంచింది. ఉదాహరణకు చిరునామా మార్పు కోసం ఇప్పటి వరకు రూ.50 మాత్రమే తీసుకునేవారు. ఇకపై అదే సర్వీస్‌కు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
రూ.100 కాకుండా రూ.125
ఇక 17 ఏళ్లు పైబడిన వారు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలంటే రూ.100 కాకుండా రూ.125 చెల్లించాలి. డెమోగ్రాఫిక్ + బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం కూడా రుసుము పెంచబడింది. ఇప్పటివరకు రూ.150 ఉండగా, అక్టోబర్ 1 నుంచి రూ.200 అవుతుంది.
myAadhaar పోర్టల్‌లో రూ.50
ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామా అప్‌డేట్ చేయించుకునే వారికి కూడా ఫీజు రెట్టింపు అవుతోంది. myAadhaar పోర్టల్ ద్వారా మార్పులు చేయించుకోవాలంటే ఇకపై రూ.25 కాకుండా రూ.50 కట్టాలి. అయితే ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే, e-Aadhaar ప్రింట్ ఫీజు మాత్రం యథాతథంగా రూ.30గానే కొనసాగుతుంది.
Also Read: Jio Vs Airtel: జియో vs ఎయిర్‌టెల్ ఏది బెస్ట్? ఫ్రీ బెనిఫిట్స్ ఎవరు ఇస్తారు?
చిన్న ట్విస్ట్.. వారందరికీ!
అయితే ఈ ఛార్జీలు అన్నీ అందరికీ వర్తించవు. కొన్ని ప్రత్యేక కేటగిరీ వారికి మాత్రం ఉచితంగా ఉంటాయి. కొత్త ఆధార్ కార్డు తీసుకునే వారికి ఎలాంటి ఫీజు లేదు. అలాగే 5 నుంచి 7 సంవత్సరాల పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్, 15 నుంచి 17 ఏళ్ల వారికీ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం. కానీ లామినేటెడ్ కార్డు కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ అప్‌డేట్ కోసం
ఇక ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాలనుకునే వారు ముందుగా UIDAI వెబ్‌సైట్ https://appointments.uidai.gov.in/ లోకి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ సెంటర్‌కి వెళ్లి పాస్‌పోర్ట్ సైజు ఫొటో, చిరునామా ప్రూఫ్, అవసరమైన డాక్యుమెంట్స్‌తో పాటు ఫారమ్ సమర్పించాలి. ఒక్కసారి అప్లై చేసిన తర్వాత అప్‌డేట్ ప్రాసెస్ పూర్తి కావడానికి 15 నుంచి 30 రోజుల సమయం పడుతుంది.
ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రాగానే, దేశవ్యాప్తంగా కోట్లాది ఆధార్ హోల్డర్లకు నేరుగా ప్రభావం చూపనున్నాయి. చిరునామా మార్చేవారు, ఫోన్ నంబర్ అప్‌డేట్ చేసేవారు, పెద్దవారి బయోమెట్రిక్ మార్చేవారు అందరూ ఈ రుసుములు తప్పనిసరిగా చెల్లించాల్సిందే. కాబట్టి ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాలనుకునే వారు త్వరగా చేసుకోవడం మంచిది. అక్టోబర్ 1కి ముందు ఫ్రీ సర్వీసులు వినియోగించుకోవచ్చు. లేకపోతే కొత్త ఛార్జీలను చెల్లించాల్సిందే.