Rs 400 Cr Revenue: వ్యవసాయం అనేది కత్తి మీద సాము లాంటిది. ప్రకృతి ప్రకోపానికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు, చీడ పీడల కారణంగా నోటికొచ్చిన పంట నేలాపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అన్నదాతలు ఇకపై అలాంటి ఇబ్బందులు పడకూడదు అనుకున్నారు. ఏడాదంతా ఆదాయం పొందే మార్గాలను ఆన్వేషించారు. చివరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు వారి తలరాతను మార్చింది. ఏడాది కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ వారు సాగు చేసే పంట ఏంటి? రైతులు ఏటా ఎంత ఆదాయం పొందుతున్నారు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్ లోని రాయ్‌గంజ్ బ్లాక్ లో ఉత్తర లఖిపూర్ గ్రామం ఉంటుంది. ఇక్కడ సంప్రదాయ పంటలు అయిన వరి, గోధుమ, ఆవాలు పండేవి. కానీ, అతివృష్టి, అనావృష్టి కారణంగా కారణంగా చాలా కాలం పాటు తీవ్ర నష్టాలను చవి చూశారు. 2007లో సుకుమార్ బర్మాన్ అనే రైతు ఈ కష్టాల నుంచి బయటపడే ఆలోచన చేశారు. సంప్రదాయ పంటలను కాకుండా ఏడాదంతా కరువు కాటకాలను, అధిక వర్షాలను తట్టుకుని ఆదాయాన్ని అందించే పంటల సాగు గురించి ఆలోచించారు. చివరకు బగారా ఆకు(బే లీవ్స్) సాగు చేయాలని నిర్ణయించారు. తన పొలంలో ఆ పంటకు సంబంధించి మొక్కలను నాటారు. ఆ నిర్ణయం ఆ ప్రాంత రైతుల తలరాతను మార్చింది. ప్రాంతంలో ఒక పెద్ద వ్యవసాయ మార్పునకు కారణం అయ్యింది.
బగారా ఆకు సాగు ఇప్పుడు ఉత్తర లఖిపూర్ లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ ప్రాంత రైతులు ఏటా రూ. 400 కోట్లు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బగారా ఆకు సాగు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. 2007 నుంచి ఈ సాగు రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 10,000 మందికి పైగా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పంట సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాది అంతా సంపాదనకు అవకాశం ఉండటంతో ఇతర పంటలను తగ్గించి పూర్తిగా బగారా ఆకు సాగు పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా బలపడుతున్నారు.
సుకుమార్ బర్మాన్ 2007లో 650 చెట్ల నుంచి ఏటా 80-90 క్వింటాళ్ల బగారా ఆకులను పండిస్తున్నారు. ఒక చెట్టు నుంచి ఏడాదికి 15-20 కిలోల ఆకులను ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ తో 25 సంవత్సరాల పంటను ఇస్తాయి. మొత్తంగా సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద వ్యవసాయ మార్పునకు కారణం అయ్యింది. అక్కడి మహిళలకు ఆర్థిక స్వావలంబన అందిస్తోంది. బగారా ఆకు సాగు అక్కడి అన్నదాతలకు సాగు కష్టాలు తీర్చి.. నష్టాలు లేని ఆదాయం పొందేందుకు కారణం అయ్యింది. ఉత్తర లఖిపూర్తో పాటు పరిసర ప్రాంతాలు కూడా ఈ పంట సాగువైపు అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు.
Read Also: ఆ రాయిని బంగారం అనుకొని ఇంట్లో పెట్టుకున్నాడు.. ‘కట్ చేస్తే’ అద్భుతం బయటపడింది