EPFO Warns: కేంద్రం.. ఈ మధ్య ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లలో నిధులు జమచేసింది. దీంతో సైబర్ నేరగాళ్లు చూపు ఆయా అకౌంట్లపై పడింది. నిధులు పడిన విషయం తెలియగానే సైబర్ మోసగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ PF సంబంధిత కాల్‌లు, సందేశాలు, లింక్‌లను ఎలా గుర్తించడం ఎలా? ఒక్కసారి చూద్దాం.
ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ అత్యంత ముఖ్యమైన పొదుపు. పదవీ విరమణ తర్వాత, సంక్షోభ సమయాల్లో వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కోట్లాది మంది తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, క్లెయిమ్‌లను పరిష్కరించుకోవడానికి, పెన్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఆన్‌లైన్ సేవలు ఉపయోగిస్తున్నారు.
దేశంలో సుమారు 8 కోట్ల మంది క్రియాశీల సభ్యులున్నారు. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలపై కన్నేశారు. EPFO పేరు మీద నకిలీ సందేశాలు పంపుతూ వారిని టార్గెట్ చేసుకున్నారు. పరిస్థితి గమనించిన EPFO సభ్యులకు ఓ సలహా జారీ చేసింది. EPFO సభ్యులు ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
తెలియని SMS, ఈ-మెయిల్‌లు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా లింక్‌లను నమ్మవద్దని తెలిపింది. ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు దాన్ని చెక్ చేసుకోవాలని, వెబ్‌సైట్ URLను జాగ్రత్తగా తనిఖీ చేయాలని పేర్కొంది. UAN, పాస్‌వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు వంటి సమాచారాన్ని పంచుకోవద్దని, ముఖ్యంగా దీనికి సంబంధించి OTPని ఎవరితో షేర్ చేసుకోవద్దని తెలిపింది.
పీఎఫ్ క్లెయిమ్, కేవైసీ లేదా అకౌంట్ అప్‌డేట్ పేరిట వాట్సాప్ లింకులను సైబర్ నేరగాళ్లు పంపుతారని, వినియోగదారుడు వాటిపై క్లిక్ చేసినప్పుడు UAN, బ్యాంక్ వివరాలు, OTP అడుగుతారని వివరించింది. వారికి సమాచారం ఇస్తే మోసపోవచ్చని తేల్చిచెప్పింది. వాట్సాప్ కాకుంటే EPFO అధికారులుగా నటిస్తూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని, వినియోగదారుని నమ్మకాన్ని తీసుకుని UAN, బ్యాంక్, OTP వివరాలు అడుగుతారని పేర్కొంది.
కేవైసీ అప్‌డేట్ పేరుతో కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా మోసం చేస్తారని వివరించింది. పీఎఫ్ ఖాతా మూసివేస్తారని క్లెయిమ్‌లు నిలిపి వేస్తారనే భయంతో వివరాలు తీసుకుని మోసం చేసే అవకాశముందని తెలియజేసింది. నకిలీ ఈ-మెయిల్‌లు పంపి, PF క్లెయిమ్, KYC పేరుతో ప్రజలను ఆకర్షిస్తారని పేర్కొంది. వాటిపై క్లిక్ చేసి లాగిన్ వివరాలను నమోదు చేయించి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశముందని తెలిపింది.
నకిలీ లింకులలో అక్షరదోషాలు, వింత డొమైన్ పేర్లు, అదనపు పదాలు ఉంటాయి. ముందుగా అధికారిక EPFO వెబ్‌సైట్ ఎలా ఉంటుందో చూడండి. వెబ్‌సైట్ పేరు, స్పెల్లింగ్‌లో ఎలాంటి తప్పులు వుండవు. EPFO మార్గదర్శకాల ప్రకారం.. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్, సోషల్ మీడియా, ఈ-మెయిల్ ద్వారా వివరాలను ఎప్పుడూ అడగదు. బలమైన పాస్‌వర్డ్ అనేది ఉండాలి. పెద్ద, చిన్న అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు ఉండేటట్టుగా చూసుకోండి.
భయపడకండి.. వెంటనే ఈ చర్యలు తీసుకోండి, నకిలీ వెబ్‌సైట్‌ను వెంటనే మూసివేయండి. UAN లేదా పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తే వెంటనే మార్చండి. బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకున్నట్లయితే బ్యాంకుకు తెలియజేయండి. ఏదైనా తెలియని యాప్ లేదా ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంటే దాన్ని తొలగించండి. అలాంటి పరిస్థితిలో వెంటనే 1930 అనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. లేకుంటే పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే చర్య తీసుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
ALSO READ: సెప్టెంబరు నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు, మూడు రోజుల సమ్మె కూడా