Kailash Mansarovar Yatra Routes: కైలాశ మానస సరోవర యాత్ర.. జీవితంలో ఒక్కసారైనా ఆ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని సందర్శించాలనేది ప్రతి హిందువు కల. కానీ, అక్కడికి వెళ్లడం అంత ఈజీ కాదు. అందుకు ఎన్నో రూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వమే స్వయంగా ఈ యాత్రను నిర్వహిస్తుంది. అయితే, దీనికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో లాటరీ పద్ధతిలో యాత్రను నిర్వహిస్తున్నారు. ఒక వేళ ఈ యాత్రకు ఎంపికైనా.. ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండాలి. మెడికల్ టెస్టుల్లో ఫెయిల్ అయితే.. ప్రభుత్వం వారిని ఎట్టి పరిస్థితిలో యాత్రకు అనుమతి ఇవ్వదు. అందుకే, భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా రాకాసి వరదలో ధ్వంసమైన చైనా – నేపాల్ సరిహద్దులోని జిరాంగ్ పోర్ట్ కూడా ఆ మార్గాల్లో ఒకటి. ఇది అత్యధిక భక్తులు ఎంచుకొనే మార్గాల్లో ప్రధానమైనది.
జారంగ్ (క్యిరాంగ్) మార్గాన్ని ఎక్కువ మంది ఎంచుకోడానికి కారణం.. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు. భారత ప్రభుత్వం నిర్వహించే మార్గాల్లో ప్రయాణించాలంటే లాటరీ విధానంలో పాల్గోవాలి. అందులో ఎంపిక కావడం అంత ఈజీ కాదు. అందుకే, చాలామంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ యాత్రకు ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు. విమానం, హెలికాప్టర్ మార్గాలతో పోల్చితే.. ఈ మార్గం ద్వారా చాలా తక్కువ ఖర్చులోనే కైలాస మానస సరోవరానికి చేరుకోవచ్చు.
భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే యాత్రలకు 21 నుంచి 25 రోజుల సమయం పడుతుంది. అయితే, చైనా – నేపాల్ సరిహద్దు మీదుగా జిరంగ్ రోడ్డు మార్గంలో ఈ యాత్ర 12 నుంచి 14 రోజుల్లోనే పూర్తవుతుంది. ఇది కాకుండా నేపాల్‌లోని కాఠ్మండు నుంచి హెలికాప్టర్ ద్వారా నేపాల్ – టిబెట్ సరిహద్దులోని హిల్సాకు చేరుకుని.. అక్కడి నుంచి తక్లాకోట్ ద్వారా కూడా మానస సరోవరం చేరుకోవచ్చు. తక్కువ సమయంలో, నడక లేకుండా వెళ్లాలి అనుకొనేవారికి ఇది బెస్ట్ రూట్. కానీ, ఖర్చు ఎక్కువ. అందుకే, చాలా తక్కువ మంది దీన్ని ఎంచుకుంటారు.
భారత ప్రభుత్వం నిర్వహించే యాత్రకు ఎక్కువ టైమ్ పడుతుంది. ఎందుకంటే.. అది పురాతన, సాంప్రదాయ మార్గం. పైన పేర్కొన్న మార్గాలేవీ అందుబాటులో లేనప్పుడు.. అంతా ఈ మార్గంలోనే వెళ్లేవారు. ఉత్తరాఖండ్‌లోని ధార్చులా, గుంజి మీదుగా సరిహద్దు దాటాలి. అయితే, ఇది ఎక్కువ టైమ్ పడుతుందనే కారణంతో ప్రభుత్వం మరో మార్గాన్ని ప్రారంభించింది. అదే నాథు లా పాస్. భారత ప్రభుత్వం దీన్ని 2015లో ప్రారంభించింది. ఈ మార్గంలో సిక్కిం మీదుగా నేరుగా చైనా బస్సుల్లో టిబెట్ చేరుకోవచ్చు. నడవాల్సిన అవసరం చాలా తక్కువ. కానీ, ఈ మార్గంలో ప్రయాణించడానికి ప్రభుత్వ లాటరీలో ఎంపిక కావాలి. అందుకే.. యాత్రికులు మానస సరోవరం వెళ్లేందుకు ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. జిరాంగ్ పోర్ట్ (నేపాల్ – చైనా సరిహద్దు) నుంచి యాత్రలు నిర్వహిస్తున్నారు. ఖర్చు తక్కువ, బోలెడన్ని సదుపాయాలతో ఈ మార్గం బాగా పాపులారిటీ సంపాదించింది. అందుకే ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. వర్షాకాలంలో అస్సలు వెళ్లకూడదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఈ యాత్ర మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో బ్యాచ్‌ల వారీగా జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు.. అక్కడి వాతావరణ పరిస్థితులు, నిబంధనలకు అనుకూలంగా ఈ బ్యాచ్‌లను అనుమతిస్తారు. జారంగ్ (క్యిరాంగ్) రోడ్డు మీదుగా వెళ్లేందుకు ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతి ఉంటుంది. ఏడాదికి 18 వేల నుంచి 24 వేల మందికి మాత్రమే అనుమతి. రోజుకు 150 నుంచి 250 మందిని మించి తీసుకెళ్లకూడదు.
హిల్సా హెలికాప్టర్ మార్గంలో కూడా ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి ఉంటుంది. ఏడాదికి ఇక్కడి నుంచి 5 వేలు నుంచి 8 వేల మంది వరకు మాత్రమే అనుమతి. రోజుకు 80 నుంచి 120 మందికి అనుమతి ఇస్తారు. లిపులేఖ్ పాస్ మాత్రం భారత విదేశాంగ శాఖ ఆధీనంలో ఉంది. ఉత్తరాఖండ్ మీదుగా వెళ్లే ఈ మార్గం నుంచి 18 బ్యాచ్‌లను తీసుకెళ్తారు. 1,080 మంది లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి తీసుకెళ్తారు. రోజుకు 60 మంది వరకు వెళ్తారు. నాథు లా పాస్ మీదుగా కూడా భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో 15 బ్యాచ్‌లను తీసుకెళ్తారు. దాదాపు 750 మందికి అనుమతి ఒక్క బ్యాచ్‌కు 50 మంది చొప్పున వెళ్తారు.
Also Read: చైనా జిరాంగ్ పోర్ట్.. చిన్న ఆనవాలు కూడా లేదాయే – ఆ భవనం అక్కడే ఎందుకు కట్టారు?
భారత ప్రభుత్వ అధికారిక కోటా ఏడాది 2 వేల మందికే పరిమితం కావడం వల్ల ఎక్కువ మంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. వారిలో అత్యధిక యాత్రికులు చైనా – నేపాల్ సరిహద్దులోని జిరంగ్ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. అందుకే, వరదలో మిస్సయిన భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండానికి కారణం కూడా ఇదే. కాబట్టి.. ఇకపై మానస సరోవరం యాత్రకు ప్లాన్ చేస్తే.. ఏది ఉత్తమ మార్గమో తెలుసుకోండి. ఆలస్యమైనా పర్వాలేదు. పూర్తి భద్రతతో ప్రభుత్వం ఎంపిక చేసిన మార్గంలో వెళ్లడమే సురక్షితం.