Intelligent Octopus: భూగోళంపై మనుషులు అనే వారే లేకపోతే.. ప్రస్తుతం ఉన్న జీవుల్లో భూమిని ఏలే తెలివైన జీవి ఏదై ఉంటుందని ఎప్పుడైనా అలోచించారా? ఒకవేళ కోతులు, చింపాజీలు, సింహాలు అని మీరు భావిస్తుంటే పెద్ద పొరపాటే. ఎందుకంటే మానవుడు లేని ప్రపంచాన్ని ఏలగల సత్తా ఒకే ఒక్క జీవికి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అది కూడా భూమ్మీద కాకుండా సముద్రపు లోతుల్లో జీవించే ఆక్టోపస్ కు మాత్రమే ఆ సామర్థ్యం ఉందని స్పష్టం చేస్తున్నాయి. అది ఎలాగో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
మనుషుల లాగే అక్టోపస్‌లు కూడా సమస్యలను త్వరితగతిన పరిష్కరించగలవు. సీసాల మూతలు తీయడం, క్లిష్టమైన పజిల్స్ విప్పడం, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ప్రణాళికలు వేయడం వీటి నైపుణ్యానికి నిదర్శనం. అంతేకాదు ఇవి మనుషుల ముఖాలను కూడా గుర్తుపట్టగలవంటే ఇవి ఎంత తెలివైనవో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకప్పుడు క్షీరదాలకు (పాలు ఇచ్చే జీవులు) మాత్రమే పరిమితమైన లక్షణాలుగా భావించేవారు. కానీ అక్టోపస్ వీటిని తిరగరాసింది.
మానవులకు కేవలం మెదడులోనే ఆలోచన శక్తి కేంద్రీకృతమై ఉంటే.. అక్టోపస్ నాడీ వ్యవస్థ ఇందుకు పూర్తి భిన్నమైంది. దీని శరీరంలోని నాడీ కణాలు దాని ఎనిమిది కాళ్లలో విస్తరించి ఉంటాయి. దీనివల్ల ప్రతి కాలు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలవు. ఒకే సమయంలో అనేక పనులను చేస్తూ.. చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా వెంటనే మారిపోగల నైపుణ్యం దీని సొంతం. ఇదే ఆక్టోపస్ ను ఇతర జీవుల కంటే ప్రత్యేకంగా నిలుపుతోంది.
ఒక వేళ మానవుల ఉనికి భూమిపై లేకుంటే.. కాలుష్యం, వేట నుంచి సముద్రాలు కోలుకుంటాయి. దీంతో పగడపు దిబ్బలు మళ్లీ పునరుజ్జీవం పొంది సంద్రంలో జీవవైవిధ్యం పునరుజ్జీవం అవుతుంది. ఇటువంటి వాతావరణంలో అక్టోపస్‌ల జనాభా ఇతర జీవుల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వాటి సమర్థవంతమైన వేట పద్ధతులను ఉపయోగించి.. సముద్ర వ్యవస్థకు తిరుగులేని నాయకుడిగా అక్టోపస్ లు మారతాయని పేర్కొంటున్నాయి.
పరిణామ సిద్ధాంతకర్తల ప్రకారం.. భవిష్యత్తులో అక్టోపస్‌లు నేలపై కూడా జీవించడానికి అనువుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రకాల అక్టోపస్‌లు ఆహారం కోసం తీర ప్రాంతాలకు వచ్చి రాతి సందుల్లో నేలపై జీవిస్తూ చిన్న చిన్న పురుగులను వేటాడుతున్నాయి. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటి ఎనిమిది కాళ్లు, పట్టు సాధించే గుణం కాలక్రమేణా నేలపై నివసించడానికి వీలుగా పరిణామం చెందే వీలుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Also Read: సెప్టెంబర్ నుంచి ఇవి మారబోతున్నాయ్.. ఆగస్టు 31 లోపు పూర్తి చేయకపోతే.. సామాన్యుల జేబుకు చిల్లే!
ఒకవేళ అక్టోపస్ లు భూమ్మీద స్థిరపడి.. తమ ఆదిపత్యాన్ని చెలాయించడం ప్రారంభిస్తే.. మానవుల ఉన్నప్పటి కంటే వాతావరణం చాలా బాగా ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మనుషులు తమ ఆధిపత్యం కోసం ప్రకృతిని నాశనం చేస్తే, అక్టోపస్ మాత్రం పర్యావరణంతో కలిసి జీవిస్తూ తన ఉనికిని చాటుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సముద్రంలో ఇవి అవలంభిస్తున్న వైఖరే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.
Also Read: 60 ఏళ్ల వివాదానికి చెక్.. పైగా భూములపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!