Dinosaur Revival: సినిమాల్లో లేదా సైన్స్ ఫిక్షన్ కథల్లో డైనోసార్లను తిరిగి ప్రాణాలతో తీసుకురావడం అందరూ చూసే ఉంటారు. అయితే ఇక్కడే చాలా మందికి ఓ ఆలోచన కలుగుతుంది. ప్రస్తుత అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని వాటిని తిరిగి సృష్టించవచ్చా? ఇది సాధ్యమేనా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. వివిధ దేశాల్లో బయటపడ్డ డైనోసార్ అవశేషాల నుంచి డీఎన్ఏను సేకరించి.. వాటిని తిరిగి సృష్టించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నలకు శాస్త్రవేత్తలు స్పష్టమైన సమాధానాలు ఇస్తున్నారు. ఇది పూర్తిగా అసాధ్యమని తేల్చేస్తున్నారు. దీనికి గల కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సాధారణంగా మనుషులు, జంతువులు చనిపోయిన తర్వాత శరీరంలోని డీఎన్ఏ క్షీణించడం ప్రారంభమవుతుంది. జీవి మరణించాక కణాలలోని మరమ్మతు వ్యవస్థ నిలిచిపోవడంతో డీఎన్ఏ అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. 2012లో న్యూజిలాండ్‌కు చెందిన అంతరించిపోయిన ‘మోవా’ పక్షుల ఎముకలపై జరిగిన ఒక అధ్యయనంలో డీఎన్ఏ అర్ధ జీవిత కాలం (Half Life) 521 సంవత్సరాలని తేలింది. ఒక వేళ ల్యాబ్ లో అతి శీతల వాతావరణంలో ఒక డీఎన్ఏను భద్రపరిచినా గరిష్టంగా 68 లక్షల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని వెల్లడైంది. ఇక డైనోసార్లు విషయానికి వస్తే అవి దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితమే భూమ్మీద అంతరించిపోయాయి. కాబట్టి వాటి డీఎన్ఏ ఇప్పుడు లభించడం పూర్తిగా అసాధ్యం.
కోట్లాది సంవత్సరాల క్రితం అంబర్ (లావా గడ్డకట్టి ఏర్పడిన జిగురు రాయి)లో చిక్కుకున్న దోమల నుండి డైనోసార్ డీఎన్ఏను సేకరించవచ్చన్న ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే పరిశోధనల్లో రుజువైంది. దీనిపై శాస్త్రవేత్తలు చేసిన అన్ని ప్రయోగాలు విఫలమయ్యాయి. అక్కడ లభించిన చిన్న చిన్న డీఎన్ఏ ముక్కలు కూడా కాలుష్యం వల్ల వచ్చినవేనని తేలింది. ఇక సినిమాల్లో చూపించినట్లు కప్పల (ఫ్రాగ్స్) డీఎన్ఏ ఉపయోగించి డైనోసార్ జన్యువుల ఖాళీలను పూరించడం కూడా సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కప్పలకు, డైనోసార్లకు పరిణామ క్రమంలో కోట్లాది సంవత్సరాల అంతరం ఉందని పేర్కొంటున్నారు. ఒక జాతి డీఎన్ఏ మరొక జాతి కణ వ్యవస్థలో పనిచేయదని వివరిస్తున్నారు.
మరోవైపు పూర్తిగా అంతరించిపోయాయని భావిస్తున్న డైనోసార్ల వారసత్వం నేటి పక్షుల రూపంలో జీవించే ఉంది. పక్షులు, ముఖ్యంగా చికెన్ (కోళ్లు).. థెరోపోడ్ వర్గానికి చెందిన డైనోసార్ల ఆధునిక రూపాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యాలే విశ్వవిద్యాలయ పరిశోధకులు కోడి పిండాల్లో కొన్ని జన్యు మార్పులు చేసి వాటి ముక్కు స్థానంలో డైనోసార్ తరహా దవడ నిర్మాణాలను, కాళ్ల ఎముకలను పునర్నిర్మించడంలో విజయం సాధించారు. అయితే ఇది ‘డైనో-చికెన్’ సృష్టించడానికి కాకుండా జీవుల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయోగం మాత్రమే.
Also Read: నేపాల్ వరద విపత్తు.. 538కి చేరిన మృతుల సంఖ్య.. 85 మంది భారతీయులు సేఫ్!
శిలాజాల నుండి డీఎన్ఏ సేకరించడం సాధ్యం కాదని తేలిపోవడంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు ‘రివర్స్ ఇంజనీరింగ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆధునిక పక్షుల జన్యువులలో నిద్రావస్థలో ఉన్న పురాతన లక్షణాలను.. ‘క్రిస్పర్’ (CRISPR) వంటి జన్యు ఎడిటింగ్ సాంకేతికతల ద్వారా తిరిగి మేల్కొలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు డైనోసార్లను యథాతథంగా తిరిగి తీసుకురాకపోయినా జీవుల పరిణామ క్రమాన్ని, జన్యు రూపకల్పనను అర్థం చేసుకోవడంలో జీవశాస్త్రానికి కొత్త దారులు చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: మనిషి లేని భూమికి.. కొత్త బాస్ ఎవరో తెలుసా? సైన్స్ చెప్పే షాకింగ్ నిజాలు!