Indian Diaspora: ప్రపంచ దేశాలకు అత్యధిక మానవ వనరులను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుస ఉంటుంది. భారత సంతతి వ్యక్తులు.. వ్యాపారులుగా, కార్మికులుగా, వృత్తినిపుణులుగా విదేశాల్లో రాణిస్తున్నారు. అక్కడ దశాబ్దాల కిందటే స్థిరపడిన వారైతే.. రాజకీయ నేతలుగా సైతం తమదైన ముద్ర వేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. మనవారు అధిక సంఖ్యలో జీవిస్తున్న దేశాలేవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
అత్యధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ స్థిరపడిన భారతీయులు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఐటీ, వైద్యం, విద్య, వ్యాపారం, రాజకీయ రంగాల్లో భారతీయ అమెరికన్లు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, డల్లాస్, న్యూజెర్సీ వంటి నగరాల్లో భారతీయ సమాజం ఎంతో బలంగా ఉంది. ఇక్కడ దీపావళి వంటి పండుగలను సైతం ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
భారత్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాల్లో యూఏఈ ఒకటి. అక్కడి విదేశీ జనాభాలో భారతీయులదే అతిపెద్ద వాటా. నిర్మాణ రంగం, రిటైల్ వ్యాపారం, ఫైనాన్స్, వైద్యం, ఐటీ విభాగాల్లో మనవారు కీలక పాత్ర పోషిస్తున్నారు. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో భారతీయులు నెలకొల్పిన రెస్టారెంట్లు, పాఠశాలలు, ఆలయాలు అక్కడి సంస్కృతిలో భాగమైపోయాయి.
మలేషియాలోనూ భారత సంతితి వ్యక్తులు అధిక సంఖ్యలో జీవిస్తున్నారు. అయితే వీరిలో మెజారిటీ ప్రజలంతా బ్రిటీష్ కాలంలో అక్కడికి వెళ్లిన వారసులు కావడం గమనార్హం. ప్రస్తుతం మలేషియా సంస్కృతిలో భారతీయులు కీలక భూమిక పోషిస్తున్నారు. అక్కడి పండుగలు, దేవాలయాలు, ఆహార అలవాట్లలో భారతీయత స్పష్టంగా కనిపిస్తోంది. కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్స్ వంటి ‘లిటిల్ ఇండియా’ ప్రాంతాలు ఇందుకు నిదర్శనం.
గడచిన దశాబ్దాల కాలంలో కెనడా సైతం భారతీయులకు నివాస యోగ్యంగా మారిపోయింది. అక్కడి టొరంటో, వ్యాంకూవర్, క్యాల్గరీ, బ్రాంప్టన్ వంటి ప్రధాన నగరాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. విద్యార్థులు, వృత్తినిపుణులు, పారిశ్రామికవేత్తలతో కూడిన భారతీయ సమాజం.. కెనడా సంస్కృతిపై చెరగని ముద్ర వేసింది. భారతీయ పండుగలు, వ్యాపారాలు కెనడాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
సౌదీ అరేబియా అభివృద్ధిలో భారతీయ శ్రామిక శక్తి, నిపుణుల పాత్ర ఎంతగానో ఉంది. నిర్మాణం, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, సేవా రంగాలలో లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. శతాబ్దాల నాటి దౌత్య, వ్యాపార సంబంధాలు, భౌగోళిక సామీప్యత వల్ల ఇరు దేశాల మధ్య అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది.
ఆగ్నేయాసియాలో అత్యంత పురాతనమైన భారతీయ సమాజాలలో మయాన్మార్ (నాటి బర్మా) ఒకటి. బ్రిటిష్ పాలనలో వ్యాపారం, పరిపాలన, కార్మిక అవసరాల కోసం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వలస వెళ్లారు. మయాన్మార్‌లో అనేక రాజకీయ మార్పులు వచ్చినప్పటికీ.. యాంగోన్ వంటి ప్రాంతాల్లో నేటికీ భారతీయ సంస్కృతి సజీవంగా ఉంది.
Also Read: నడవలేము మహాప్రభో.. ప్రపంచ ‘బద్దకస్తుల’ జాబితాలో.. భారత్ స్థానం ఎంతంటే?
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన కార్మిక కొరతను తీర్చడానికి భారతదేశం నుంచి పెద్ద ఎత్తున బ్రిటన్‌కు వలసలు ప్రారంభమయ్యాయి. అలా అక్కడికి వెళ్లి సెటిల్ అయిన వారి వారసులు.. ప్రస్తుతం బ్రిటన్ లోని కార్పొరేట్ రంగం, రాజకీయం, ఆరోగ్యం, విద్య, కళారంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. లండన్, లీస్టర్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మనవారి ప్రభావం అక్కడి ఆహారపు అలవాట్లపై కూడా పడింది. భారతదేశానికి చెందిన ‘చికెన్ టిక్కా మసాలా’ బ్రిటన్ ప్రజల అత్యంత అభిమాన వంటకాలలో ఒకటిగా మారిపోయింది.
Also Read: Airtel ఆల్ రౌండర్ ప్లాన్.. 3 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీగా 20+ ఓటీటీలు!