Nepal Disasters: ప్రకృతి అందాలకు నిలయమైన నేపాల్ తరచూ విపత్తుల సుడిగుండంలో చిక్కుకుంటోంది. భూకంపాలు, కుండపోత వర్షాలు, వినాశనకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం అక్కడ సర్వసాధారణంగా మారాయి. భౌగోళిక వ్యూహం నుంచి వాతావరణ మార్పుల వరకు నేపాల్‌ను ఏకకాలంలో చుట్టుముడుతున్న ప్రధాన ముప్పులను పరిశీలిస్తే ఆ దేశం ఎందుకు నిరంతరం విపత్తుల ఉచ్చులో చిక్కుకుంటోందో అర్థమవుతుంది.
ఇండియన్ – యురేషియన్ భూఫలకాలు కలిసే చోట నేపాల్ ఉంది. ఈ ఫలకాలు నిరంతరం ఒకదానినొకటి ఢీకొట్టడం వల్ల ఇక్కడ తరచూ భారీ భూకంపాలు వస్తుంటాయి.
నేపాల్ లోని ఎత్తైన హిమాలయాల నుంచి వేగంగా ప్రవహించే నదులు.. వర్షాకాలంలో తీవ్ర రూపాన్ని దాలుస్తున్నాయి. ఆ నీటి ప్రవాహం కొండచరియలను సైతం తుడిచిపెట్టేంత శక్తివంతంగా మారుతుండటం గమనార్హం.
ప్రపంచ సగటు కంటే హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు త్వరగా కరిగిపోయి నీటి ప్రవాహాల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
హిమాలయాల్లో మంచు కరగడం వల్ల ఎత్తైన ప్రాంతాల్లో వేలాదిగా కృత్రిమ మంచు సరస్సులు (Glacial Lakes) ఏర్పడుతున్నాయి. ఇవి ఒక్కసారిగా బద్దలైతే దిగువ ప్రాంతాలను ఊహించని వరదలు చుట్టుముడుతున్నాయి.
గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే నేపాల్ లో ఒక ప్రమాదం మరొక ప్రమాదానికి దారితీస్తోంది. భూకంపం వల్ల భూమి బలహీనపడితే ఆ వెంటనే వచ్చే వర్షాలు కొండచరియలు విరిగిపడేలా చేస్తున్నాయి. పెద్ద ఎత్తున విధ్వంసానికి కారణమవుతున్నాయి.
సాధారణంగా జులై నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే రుతుపవనాలు నేపాల్ లో అతివృష్టికి కారణమవుతున్నాయి. అక్కడ కొన్ని గంటల్లోనే నెలకు సరిపడా భారీ వర్షాలు కురిసి వినాశనానికి దారి తీస్తున్నట్లు నేపాల్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
నేపాల్ భూభాగం నిటారైన కొండలు, జాలువారిన మట్టి నేలతో కూడుకొని ఉన్నాయి. దీనికి తోడు నిటారుగా ఉండే ఇరుకైన లోయలు వరద నీటి మట్టాన్ని ఒక్కసారిగా పెంచి నష్ట తీవ్రతను పెంచుతున్నాయి.
నేపాల్ లో సంక్లిష్టమైన కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు ఉండటం వల్ల విపత్తు సంభవించినప్పుడు క్షతగాత్రులను రక్షించడం, సహాయం అందించడం అత్యంత సవాలుగా మారుతోంది. దీనివల్ల విపత్తుల సమయంలో మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది.
Also Read: Airtel అల్ రౌండర్ ప్లాన్.. 3 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీగా 20+ ఓటీటీలు!
కేవలం ప్రకృతి పరమైన అంశాలు మాత్రమే కాకుండా.. మానన తప్పదాలు సైతం నేపాల్ లో వినాశనానికి దారితీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణాళికలు లేని రోడ్ల నిర్మాణం, అడవుల నరికివేత, అస్తవ్యస్తమైన పట్టణీకరణ ఈ విపత్తు తీవ్రతను రెట్టింపు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Also Read: స్పేస్‌లోకి 3,301 తేనెటీగలు.. 1984లో నాసా చేసిన ఈ ప్రయోగం చూస్తే.. ఇప్పటికీ గూస్‌బంప్స్ పక్కా!