India Obesity Risk: ప్రముఖ ఫుడ్ మేకింగ్ కంపెనీలు భారత్ విషయంలో ఒకలా విదేశాల్లో మరొలా ఉంటున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. యూరప్ వంటి దేశాల్లో సాధారణ స్థితిలో ఉన్న చక్కెర, కొవ్వు పరిమాణం.. భారత్ కు వచ్చేసరికి డబుల్, ట్రిపుల్ రెట్లు అవుతున్నట్లు తేలింది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ నిర్వహించిన పరిశోధనలో.. బ్రిటన్‌లో దొరికే ఫాంటా (Fanta) డ్రింక్‌లో ప్రతి 100ml కు 4.6 గ్రాముల చక్కెర ఉంటే.. భారత్ లో మాత్రం 13.7 గ్రాముల చక్కెర ఉంటోంది. అంటే బ్రిటన్ డ్రింక్ కంటే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
కూల్ డ్రింక్స్ మాత్రమే కాకుండా.. భారత్‌లోని కిట్‌క్యాట్ చాక్లెట్‌లోనూ ఈ వ్యత్యాసాన్ని రాయిటర్స్ గుర్తించింది. భారత్ లో విక్రయించే కిట్ క్యాట్ లో 4.2 శాతం మాత్రమే కోకో సోలిడ్స్ ఉంటే.. ఆస్ట్రేలియా వెర్షన్‌లో ఏకంగా 22 శాతం ఉంటుండడం గమనార్హం. అలాగే బ్రిటన్‌లో మ్యాగీ నూడుల్స్ తయారీకి ప్యాకేజింగ్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉపయోగిస్తుంటే.. మన దేశంలో మాత్రం పామాయిల్‌నే ఎక్కువగా వాడుతున్నారట.
ప్రఖ్యాత రీసెర్చ్ జర్నల్ లాన్సెట్ అంచనా ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో దాదాపు 45 కోట్ల మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనదేశంలో బరువు తగ్గించే ఉత్పత్తులు, ఆకలిని నియంత్రించే ఔషధాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల, అధిక బరువు పట్ల ఆందోళన చెందుతున్న ఈ సమయంలో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల విక్రయాల్లో నెలకొన్న ఈ నిర్లక్ష్యం ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ప్రస్తుతం మనదేశంలో ప్యాకెట్ల వెనుక భాగంలో ఒక చిన్న పట్టిక రూపంలో పోషకాల వివరాలను (Nutritional Values) ముద్రిస్తున్నారు. అయితే దాన్ని చదివి, లెక్కలు వేసి అర్థం చేసుకోవడం సగటు వినియోగదారుడికి కష్టంతో కూడుకున్న పని. దీనికి భిన్నంగా ప్రపంచంలోని అనేక దేశాలు ప్యాకెట్‌కు ముందు భాగంలోనే స్పష్టమైన గ్రాఫిక్స్ లేదా రంగులతో ‘హై ఇన్ షుగర్’ (అధిక చక్కెర), ‘హై ఇన్ సాల్ట్’ (అధిక ఉప్పు) అని హెచ్చరిక లేబుళ్లను వేస్తున్నాయి. వీటిని చూడగానే వినియోగదారులు ఆ ఆహారం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిదో తక్షణమే ఒక నిర్ణయానికి రాగల్గుతున్నారు.
గతంలో భారత ఆహార భద్రత సంస్థ (FSSAI)తో భేటి సందర్భంగా కార్పొరేట్ ఫుడ్ కంపెనీలు ఈ వార్నింగ్ లేబుల్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్యాకెట్ ముందు భాగంలో హెచ్చరికలు పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. వినియోగదారులు ఎంత పరిమాణంలో తింటున్నారనే దానిపైనే దృష్టి పెట్టాలని కంపెనీలు వాదించాయి. అలాంటిది ఇవే కంపెనీలు బ్రిటన్ వంటి విదేశీ మార్కెట్లకు వచ్చేసరికి.. స్వచ్ఛందంగా హెచ్చరిక లేబుళ్లను వాడుతుండడం గమనార్హం. ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసినప్పటికీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడం కష్టమని FSSAI కోర్టుకు తెలిపింది.
Also Read: నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి.. 105 మంది భారతీయులు గల్లంతు!
ఇండియన్ ఫుడ్ అండ్ బెవరేజ్ అసోసియేషన్ (IFBA) ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ప్రమాణాల బట్టి చూస్తే మనదేశంలో దొరికే 80 శాతానికి పైగా ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల్లో కొవ్వు, చక్కెర, ఉప్పు ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ రంగులతో కూడిన ‘రెడ్ వార్నింగ్ లేబుళ్లు’ తప్పనిసరి చేస్తే.. మార్కెట్లోని దాదాపు అన్ని ప్యాకెట్లు ఎరుపు రంగు హెచ్చరికలతోనే నిండిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చక్కెర కలపని కొబ్బరి నీళ్ల ప్యాకెట్లపై కూడా ‘హై షుగర్’ అని ముద్రించాల్సి వస్తుందని వారు ఉదహరిస్తున్నారు. ఏది ఏమైనా మారుతున్న కాలంతో పాటు భారతీయుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలలో పారదర్శకత, స్పష్టమైన సమాచారం, కఠినమైన నిబంధనలు ఎంతైనా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: బాహుబలి పవర్ బ్యాంక్.. ఏకంగా లక్ష mAh బ్యాటరీ.. 20 సార్లు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు!