Subsidy Vehicles: ఉపాధి లభించి బతుకు చిత్రం మారుతుందని ఆశపడ్డ పేద లబ్ధిదారులకు ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం, అధికారుల అనాలోచిత నిర్ణయాలు శరాఘాతంగా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ పథకాల్లో భాగంగా తమ సొంత వాటా సొమ్మును సకాలంలో చెల్లించినప్పటికీ, వాహనాల పంపిణీ మాత్రం ముందుకుసాగడం లేదు. రవాణా శాఖ తెరపైకి తెచ్చిన ‘రోడ్డు సేఫ్టీ సెస్’ మెలికతో వేలాది వాహనాలు షోరూంలకు, శాఖాపరమైన కార్యాలయాల వద్దే నిలిచిపోయాయి.
రాష్ట్రంలో మత్స్యకారుల ఉపాధి కోసం.. ఇతర ప్రాంతాలకు వెళ్లి చేపలు విక్రయించేందుకు, రవాణాసౌకర్యం కోసం సబ్సిడీపై ప్రభుత్వం వాహనాలు అందజేస్తుంది. అందుకోసం పీఎంఎంఎస్వై కింద లబ్దిదారులకు సబ్సిడీ అందజేస్తుంది. టూ వీలర్, త్రీవీలర్స్(ఐస్ బాక్స్), ఫోర్ వీలర్స్ (మొబైల్ అవుట్ లెట్స్) కోసం అందజేస్తుంది. మహిళలకు 60శాతం, పురుషులకు 40శాతం సబ్సిడీపై వాహనాలను ఇస్తుంది. ఫోర్ వీలర్ కు 10లక్షలు, త్రివీలర్ 3లక్షలు, టూ వీలర్ కు 75వేలు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ వాహనాల సరఫరాలో షోరూం ప్రైస్, ఐస్ బాక్స్, లైఫ్ టాక్స్ రిజిస్ట్రేషన్ హైపోతిటికేషన్ ఛార్జెస్ , హెచ్ఎస్ఆర్ ప్లేట్ అన్ని కలిపి ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.
లబ్ధిదారులు ఇదివరకే తమకు కేటాయించిన వాటాను కష్టపడి చెల్లించారు. అయితే, వాహనాల రిజిస్ట్రేషన్ సమయానికి వచ్చేసరికి అధికారులు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ‘రోడ్డు సేఫ్టీ సెస్’ చెల్లిస్తేనే వాహనాలను ముందుకు కదిలిస్తామని కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈఏడాది మార్చి 1 నుంచి ద్విచక్ర వాహనాలులకు ప్రతి వాహనానికి ₹2,000 సెస్, మూడు చక్రాల వాహనాలు (3-వీలర్), నాలుగు చక్రాల వాహనాలు (4-వీలర్): ప్రతి వాహనానికి ఏకంగా ₹10,000 సెస్ చెల్లించాల్సిందేననిలబ్దిదారులకు అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
Also read: ప్రయాణానికి ముందు ఒంటెలకు ఉప్పు ఎందుకు తినిపిస్తారు? దీని వెనకున్న సైన్స్ ఏంటి?
ఇప్పటికే అప్పులు చేసి సొంత వాటా కట్టిన పేద లబ్ధిదారులు, ఈ అదనపు భారాన్ని భరించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం సెస్ నిధులు చెల్లిస్తేనే వాహనాలు ఇస్తామని లబ్ధిదారులకు సమాచారం అందిస్తామని చెప్పినట్లు సమాచారం. వేరే మార్గం లేక కొంతమంది లబ్ధిదారులు ఈ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లబ్దిదారులపై ఈ అదనపు భారం పడినట్లు సమాచారం. ప్రభుత్వానికి ఈ భారం మోయాలని లేఖ రాస్తే బాగుండేదని పలువురు లబ్దిదారులు అభిప్రాయపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రధానంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల విక్రయాలు, రవాణా కోసం సబ్సిడీపై మంజూరైన వాహనాలు కొన్ని నెలలుగా లబ్ధిదారులకు అందకుండా పోయాయి. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా, సెస్ మినహాయింపు లేదా బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం సబ్సిడీపై వాహనాలు ఇస్తుందనే మత్స్యశాఖ అధికారులు ప్రకటనలు చేశారు. దీంతో టూవీలర్ , త్రీవీలర్ వాహనాల కోసం వేలల్లో దరఖాస్తు చేసుకోగా, ఫోర్ వీలర్ కోసం 500వరకు మత్స్యకారులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే అధికారులు ప్రాసెస్ ను స్పీడప్ చేయకపోవడం, ప్రభుత్వం నుంచి సైతం పంపిణీపై, సెస్ పై క్లారిటీ రాకపోవడంతో పంపిణీ పెండింగ్ లో పడినట్లు సమాచారం. దీంతో మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుంది. నెలల తరబడి వాహనాలకోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనికి తోడు లక్షల రూపాయలు అప్పులు చేసి వాహనాల కోసం చెల్లిస్తే వడ్డిపెరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వస్తే చేపలు విక్రయించి చెల్లిద్దామనుకుంటున్న మత్స్యకారులకు నిరాశే ఎదురవుతుంది.
Also read: సెప్టెంబరు నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు, మూడు రోజుల సమ్మె కూడా
మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అయితే వాహనాలకు లబ్దిదారుల వాటాను డీడీ రూపంలో చెల్లిస్తున్నారు. దీంతో అధికారులకు కమీషన్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో వాహనాలకు సంబంధించిన ఫైల్ ముందుకు సాగడం లేదని సమాచారం. కమీషన్ రాకపోవడంతోనే పైల్ పెండింగ్ లో పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
“సంవత్సరం కిందట రూ.వేలు అప్పు చేసి ప్రభుత్వానికి సొంత వాటా కట్టాం. ఇప్పటికీ వాహనం చేతికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ వేలల్లో సెస్ కట్టమంటే ఎక్కడి నుంచి తేలిక?” అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఉపాధి లేక, మరోవైపు కట్టిన డబ్బులకు వడ్డీలు పడి పేదలు నానా అవస్థలు పడుతుంటే.. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలు, సెస్ పేరుతో సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, సెస్ భారం నుండి మినహాయింపు ఇచ్చి, ఏడాదిగా మూలనపడ్డ వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుంటారా? లేదా అనేది చర్చకుదారితీసింది.
Also read: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే గుండె ఆగిపోతుంది!