BigTV English

Gold Prices: ఎంత పని చేస్తివి ట్రంపు సారూ! బంగారం ధర బంగారమాయెనే..!

Gold Prices: ఎంత పని చేస్తివి ట్రంపు సారూ! బంగారం ధర బంగారమాయెనే..!

Gold Prices: కొన్ని రోజులుగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు.. తాజాగా ట్రంప్ దెబ్బకు బెంబేలెత్తుతున్నాయి. ఇప్పటికే, రికార్డ్ స్థాయిలో ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలకు ట్రంప్ టారీఫ్‌లతో కొత్త రెక్కలు పొడుచుకొచ్చాయి. పది గ్రాముల బంగారం ధర లక్ష దాకా చేరుకుంటుందనే అనుమానం కాస్తా ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. గోల్డ్ మారథాన్ ఇలాగే కొనసాగితే.. ఏం చేయాలా అని అంతా ఆందోళనపడుతున్నారు. ఇంతకీ, పసిడిపై ట్రంప్ భారం ఎలా పనిచేసింది..? ట్రంప్ టారీఫ్‌లతో బంగారం ధరల్లో వచ్చే మార్పులేంటీ..?


ట్రంప్ టారీఫ్‌ల తర్వాత పుంజుకున్న బంగారం ధర

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పరస్పర సుంకాలను ప్రకటించారు. “లిబరేషన్ డే” పేరుతో ప్రతీకార సుంకాలను ప్రపంచంపై వదిలారు. చైనా లాంటి ప్రత్యర్థి దేశాలతో పాటు తైవాన్, జపాన్ లాంటి మిత్రదేశాలకు కూడా చెమటలు పట్టించేలా ట్రంప్ టారీఫ్‌లు మోత మోగాయి. దీంతో.. పసిడి ఎగుమతులను నమ్ముకున్న భారత్‌పై కూడా భారీ భారం పడుతుందనే అంచనాలు పెరిగాయి. ట్రంప్ టారీఫ్‌ల ప్రకటన తర్వాత, బంగారం ధరలు ఈ రోజు మరింతగా పెరిగాయి. మరోవైపు ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడటంతో రూపాయి విలువ భారీగా బలహీనపడింది.


పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు

గత కొన్ని రోజులుగా బంగారం ధర నిరంతరం పెరుగుతూ ఆల్ టైం సరికొత్త రికార్డ్ ధరకు చేరాయి. దీంతో, పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక పెళ్లిళ్ల సీజనలో బంగారం ఎక్కువగా కొనుగోళ్లు చేసేందుకు ప్లాన్ చేస్తున్న పరిస్థితుల్లో… బంగారం ధరలు అంతరిక్షాన్ని అంటేలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు వంటి చాల అంశాల ద్వారా బంగారం ధరల్లో మార్పులు సహజమే అయినప్పటికీ… ఇప్పుడు ట్రంప్ టారీఫ్‌లతో పసిడి ధర పైపైకి పాకుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.

ఏప్రిల్ 3 తేదీన, 10గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.85,600

ఏప్రిల్ 3 నుండి అమల్లోకి వచ్చిన ట్రంప్ కొత్త సుంకాల విధానం భారత్‌లో బంగారం ధరలను 10 గ్రాములకు లక్ష రూపాయలకు పెంచవచ్చనే అంచనాలు దారితీసింది. ఇటీవలే, పాత రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించిన బంగారం ధర.. ఇప్పుడిప్పుడే కాస్త స్థిరపడినట్లు కనిపించింది. ఏప్రిల్ 4 తేదీన, 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 85 వేల 600 ఉండగా.. 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 93 వేల 380కు చేరుకుంది. ఇక, దేశంలోని ప్రముఖ నగరాలలో ధరలు చూస్తే.. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.85 వేల 750 రూపాయలు.. 24 క్యారెట్లకు రూ.93 వేల 530 రూపాయలు ఉంది. ఇక, హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.85 వేల 600 కాగా.. 24 క్యారెట్ల పసిడి రూ.93 వేల 380 పలుకుతుంది. విజయవాడలోనూ ఇదే విధంగా బంగారం రేటు రూ.90 వేలు దాటి దడ పుట్టిస్తోంది. అయితే, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ మంటలతో 10 గ్రాముల బంగారం ధర లక్ష క్రాస్ అవుతుందని అనుకుంటున్నారు.

కీలక వాణిజ్య భాగస్వాములపై ట్రంప్ భారీ సుంకాలు

అయితే, 2025 ప్రారంభం నుండి కూడా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు దాదాపు 20% పెరిగాయి. ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన విదేశీ దిగుమతి పన్నుల విధానంతో మరోసారి రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వాణిజ్య భాగస్వాముల పై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఆయన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బెంబేలెత్తిపోయారు. దీంతో సురక్షితమైన పెట్టుబడుల కోసం అందరూ బంగారం వైపు చూశారు.

ప్రస్తుతం, ఔన్సుకు 0.4% పెరిగి, $3,164.20

దీంతో బంగారం ధరలు పాత రికార్డును అధిగమించాయి. గత నెలలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.11 వేల 983 రూపాయలు.. అంటే, 7% పెరిగి రూ.91 వేల 115కి చేరుకున్నాయి. మార్చి 2న రూ.85 వేల 320 రూపాయలుగా ఉంది. ప్రపంచ మార్కెట్లో, ఏప్రిల్ 2 నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3 వేల 132.53 డాలర్లను అధిగమించింది. అంతకుముందు, రోజు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో $3 వేల 148.88 డాలర్లను తాకింది. దీనికి అమెరికా సుంకాలు, సంభావ్య ఆర్థిక పతనం ఆందోళనలు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం, స్పాట్ బంగారం ఔన్సుకు 0.4% పెరిగి.. $3 వేల 164.203 డాలర్ల రేటును నమోదు చేసుకుంది.

లక్ష మార్కును చేరుకోవడానికి కేవలం రూ. 9వేల గ్యాప్

ప్రస్తుతం బంగారం లక్ష రూపాయల మార్కును చేరుకోవడానికి కేవలం రూ. 9వేల రూపాయల దూరంలోనే ఉంది. లక్ష రూపాయలకి చేరుకోవాలంటే ప్రస్తుతమున్న స్థాయిల నుండి దాదాపు 10% పెరుగుదల అవసరం. అయితే, బలమైన సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, అలాగే ట్రంప్ టారిఫ్ ప్లాన్‌ల వల్ల.. ప్రపంచ భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో బంగారం ధర పెరగడానికి ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫెడ్ రెండు రేట్ల కోతలను అంచనా వేస్తుండటంతో.. 2025లో బంగారం లక్ష రూపాయల మార్కును తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. అంతేకాకుండా, సురక్షితమైన ఆస్తిగా పరిగణించబడుతున్న బంగారం.. ఇప్పుడు మరింత డిమాండ్‌ను పెంచిందని, ఆర్థిక అనిశ్చితి కాలంలో నిధుల ప్రవాహాలను పెంచిందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎంత ఎత్తుకు వెళ్లవచ్చనే దానిపై “పరిమితి” కూడా లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

FY24 నాటికి బంగారు ఆభరణాల విభాగంలో..

అంతర్జాతీయ మార్కెట్‌లో మార్చి 14న బంగారం తొలిసారిగా ఔన్సుకు $3 వేల డాలర్ల మైలురాయిని దాటింది. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా రేటు తగ్గింపు వైఖరితో ఈ చారిత్రాత్మక ర్యాలీ ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దాన్ని మించిన ట్రంప్ టారిఫ్ వార్ గోల్డ్ రేటును మరింత పెంచింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి… బంగారు ఆభరణాల విభాగంలో భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 30%గా ఉంది. కాగా, భారతదేశ బంగారు ఆభరణాల దిగుమతులపై ట్రంప్ 20% సుంకాలు విధించిన తర్వాత.. యూఎస్ దిగుమతి సుంకాల్లో బంగారంపై 5.5% నుండి 7% పెరుగుదల ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇది ఇప్పుడున్న బంగారం రేటు కంటే చాలా ఎక్కువగా ధరను పెంచే ఛాన్స్ ఉంది.

కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలుతో పసిడి ధరలపై ఒత్తిడి

అయితే, కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలపై అమెరికా ఎటువంటి సుంకాలు విధించనప్పటికీ, భారతదేశం 5% దిగుమతి సుంకాన్ని విధిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఇక, కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోలు చేయడం వల్ల పసిడి ధరలపై ఒత్తిడి పెరుగుతుందని కూడా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా వైఖరి తర్వాత ఇండియన్ రూపాయి బలహీనపడటం దేశీయ బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా కనిపిస్తోంది. అలాగే, కరెన్సీ విలువ మరింత తగ్గడం బంగారం ధరలు రూ. లక్ష మార్కును చేరుకోవడానికి తోడ్పడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 18.64% కంటే ఎక్కువ పసిడి రాబడి

అయితే, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో బంగారం 18.64% కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఇది 1986లో చివరి మూడు నెలల తర్వాత రెండవ ఉత్తమ త్రైమాసికంగా నిలిచింది. ఇక, 2024-25కి, బంగారం రాబడి 39.73% వద్ద ఉంది. ఈ ఊపును దృష్టిలో ఉంచుకుని, 2025లో మిగిలిన మూడు త్రైమాసికాల్లో అదనంగా 10% నుండి 12% లాభం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు విధానాలు, భౌగోళిక రాజకీయ నష్టాలు, రూపాయి విలువ తగ్గుదల కారణంగా బంగారం ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది.

పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి రెడీ

అందుకే, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇటువంటి కాలంలో ధరను మేనేజ్ చేయడం, తరచుగా ధర పెరగడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి వచ్చే ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవడంలో బంగారం సహాయపడుతుందని అంటున్నారు. అందుకే, పెట్టుబడిదారులు 5% నుండి 20% బంగారం, బంగారం సంబంధిత ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది, రిటైల్ మార్కెట్లో బంగారం ధర మరింత పెరగడానికి కారణం అవుతుంది.

13 ఆల్ టైమ్ గరిష్టాలను సాధించిన బులియన్

బులియన్ ఈ సంవత్సరం, ఇప్పటివరకూ.. 13 ఆల్ టైమ్ గరిష్టాలను సాధించింది. వరుసగా రెండవ వారం లాభాల బాటలో ఉంది. మరోవైపు, ఫెడ్ రేటు కోతల అవకాశాలతో పాటు.. భౌగోళిక రాజకీయ, ఆర్థిక ఆందోళనలతో సహా పసిడి ఇంత అధిక ధరలను చేరడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ట్రంప్ టారిఫ్ యుద్ధం బంగారం డిమాండ్‌ను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనితో పాటు ఆర్థిక మార్కెట్లో కుదుపు, మాంద్యం భయాలను పెంచిన వైనం వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది.

ఆర్థిక మార్కెట్లో కుదుపు, మాంద్యం భయాలు

అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్ ETF అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ ప్రకారం.. ఫిబ్రవరి చివరిలో దాని హోల్డింగ్స్ 905.81 మెట్రిక్ టన్నుల వద్ద ఉన్నట్లు తెలిపింది. అయితే, ఆగస్టు 2023 తర్వాత దాని గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, నాటి డేటా ప్రకారం యూఎస్ కన్జ్యూమర్ ధరలు.. విశ్లేషకులు ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గాయి. ఇది ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలకు ఎక్కువ అవకాశాన్ని సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు.

బంగారం దిగుమతులపై సుంకాలు విధించొచ్చనే భయాలు

ఇక, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో.. బంగారం దిగుమతులపై సుంకాలు విధించవచ్చనే భయాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం, అమెరికాలోని కొన్ని అతిపెద్ద బ్యాంకులు వాణిజ్య విమానాల్లో లండన్ నుండి న్యూయార్క్ నగరానికి బంగారు కడ్డీలను రవాణా చేయాలని కూడా వెల్లడించాయి. ఇలా రోజు రోజుకూ పెరుగుతున్న పసిడి ధరల మధ్య.. విశ్లేషకుల అంచనా వేసిన దానికంటే అధికంగా బంగారం దూసుకుపోతుందని అనుకుంటున్నారు. దీని ప్రకారం.. ఈ ఏడాది మూడవ త్రైమాసికం నాటికి, బంగారం ఔన్సుకు $3,500 డాలర్లకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ సంవత్సరం మూడవ త్రైమాసికం నాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధి 0.3%కి తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న నేపధ్యంలో.. బంగారం కీలకమైన సురక్షితమైన ఆస్తిగా మిగిలిపోయే అవకాశం ఉంది.

గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి లాభాల బుకింగ్

అయితే, బంగారం ధర తగ్గడానికి దారి తీసే ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి లాభాల బుకింగ్. గత మూడు నెలలుగా బంగారం ఈటీఎంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా మధుపరులు పెద్ద ఎత్తున ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ గోల్డ్ ఈటీఎఫ్ బాండ్ల నుంచి లాభాలను సాధించడానికి తాత్కాలిక లాభం కోసం ఎదురు చూసే పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే బంగారం ధర మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.

రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంపై ఇంకా లేని స్పష్టతవాయిస్

అలాగే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుకు అవకాశం కూడా లేకపోలేదు. అగ్రదేశం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు బంగారం మార్కెట్లో స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచినట్లయితే, దాని ప్రభావం బంగారంపై పడి దాని ధర తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×