India GDP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటును ఎస్& పీ గ్లోబల్, క్రిసిల్ ఇండియా ఫార్వర్డ్ అంచనా వేసింది. పశ్చిమ ఆసియాలో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపించడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.6 శాతానికి తగ్గనుంది . దేశీయంగా మౌలిక అంశాలు బలంగా ఉన్నప్పటికీ, ఇంధన సంక్షోభంతో స్థూల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడుతోంది. దీంతో మునుపటి అంచనాలను క్రెడిట్ సంస్థలు తగ్గించాయి.
భారతదేశ వృద్ధి రేటు ఈ ఏడాది ప్రారంభంలోని 7.1 శాతం అంచనా వేశారు. గతంలో నమోదైన 7.6 శాతం వృద్ధి కంటే ఈ అంచనా తక్కువ. పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు, ఇంధన సరఫరా అంతరాయాలు ఆర్థిక వేగాన్ని మందగించేలా చేశాయని విశ్లేషకులు చెప్తున్నారు. 2023 నుంచి 2026 మధ్య భారత్ వార్షిక జీడీపీ 7.3 శాతంగా నమోదు చేసుకుంది. అదే సమయంలో, పెరిగిన ఇంధనం, రవాణా, ముడిసరుకుల ఖర్చులతో ద్రవ్యోల్భణం 2 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నప్పటికీ, ఇంధన ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరుగుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు కీలకమని ఎస్ అండ్ పీ తెలిపింది. ఇండియా ఫార్వర్డ్ నివేదికలో.. ఇంధన సరఫరాలో అంతరాయాలు, పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులతో భారత్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లను గురవుతుందని క్రిసిల్ తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే.. ఖరీఫ్ పంటలకు ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇటీవల ఈయూ, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలను పొందాలంటే భారత్ మరిన్ని సంస్కరణలు చేపట్టాలని నిపుణులు సూచించారు.
Also Read: దూసుకుపోతున్న భారత్ జిడిపీ.. సంతోషించాల్సిన విషయం కాదు.. నిపుణుల హెచ్చరిక
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 0.6 శాతం మేర తగ్గి 6.3 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని ఏడీబీ అంచనా వేశారు. చమురు, గ్యాస్ దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడుతుండడంతో.. ద్రవ్యోల్బణం పెరగొచ్చని పేర్కొన్నారు. 2026-27లో ద్రవ్యోల్బణం 2.4 శాతం మేర పెరిగి 6.9 శాతానికి చేరుతుందన్నారు. అయితే వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు.