LIC Denies Allegations: కేంద్ర ప్రభుత్వ శాఖల ఒత్తిళ్లతోనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుందని ది వాషింగ్టన్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తలపై ఎల్ఐసీ ఇస్తూ ఓ ప్రకటన చేసింది.
‘ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలను బాహ్య ఒత్తిళ్లు ప్రభావితం చేస్తున్నాయని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలు నిరాధారమైనవి. వాషింగ్టన్ పోస్టు కథనంలోని విషయాలు పూర్తిగా అవాస్తవాలు. పెట్టుబడులపై ఎల్ఐసీ సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. ఎల్ఐసీ ద్వారా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో నిధులు పంపేందుకు ఒక రోడ్‌మ్యాప్ సృష్టించారన్నది అవాస్తవం. ప్రత్యేక ప్రణాళికతో బోర్డు ఆమోదించిన విధానాల మేరకు పెట్టుబడి నిర్ణయాలను ఎల్ఐసీ స్వతంత్రంగా తీసుకుంటుంది’ అని ఎల్ఐసీ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ నుంచి అదానీ గ్రూప్ కంపెనీలకు దాదాపు 3.9 బిలియన్ల డాలర్ల పెట్టుబడులను మళ్లించేందుకు మే నెలలో ఒక ప్రతిపాదనను రూపొందించి, అమలుచేస్తున్నారని అమెరికాకు చెందిన ‘ది వాషింగ్టన్ పోస్ట్’ న్యూస్ పేపర్ కథనాలు ప్రచురించింది. ఈ వార్తలను ఎల్ఐసీ శనివారం తోసిపుచ్చింది. వీటిని తప్పుడు కథనాలుగా పేర్కొంది. ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రభుత్వ శాఖలు లేదా మరే ఇతర సంస్థలు అలాంటి నిర్ణయాధికారం లేదని తెలిపింది.
అదానీ పోర్ట్స్ & సెజ్ లో ఎల్ఐసీ మే 2025లో 570 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. ఆ సమయంలో అదానీ గ్రూప్ యూఎస్ విచారణను ఎదుర్కొంటోందని తెలిపింది. ఎల్ఐసీ ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియో చాలా వైవిధ్యంగా ఉందని, ఇది ప్రమాదానికి దారితీస్తుందని వాషింగ్టన్ పోస్టు నివేదికలో పేర్కొంది.
భారత్ లో రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ సంస్థల మొత్తం అప్పులో ఎల్ఐసీ వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అమెరికాకు చెందిన అతిపెద్ద పెట్టుబడిదారులు బ్లాక్‌రాక్, అపోలో, జపాన్‌కు చెందిన అతిపెద్ద బ్యాంకులు మిజుహో, ఎంయుఎఫ్‌జీ, జర్మనీకి చెందిన రెండో అతిపెద్ద బ్యాంకు డిజెడ్ బ్యాంక్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఇటీవలి అదానీ సంస్థలకు రుణాలు ఇచ్చాయి. అదానీ సంస్థలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నమ్మకాన్ని సడలించేందుకు ఈ కథనాలు రాస్తున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
వాషింగ్టన్ పోస్ట్ నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. ఎల్‌ఐసీ పెట్టుబడులపై వాషింగ్టన్ పోస్టు అవాస్తవాలు ప్రచురించిందని పేర్కొంది. ఎల్‌ఐసీ మల్టీ నేషనల్ కార్పొరేట్ గ్రూపులలో పెట్టుబడులు పెడుతుందని గుర్తుచేసింది. ఎల్ఐసీ అదానీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తప్పుడు కథనాలు రాస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా ఎల్‌ఐసీ తన పెట్టుబడులకు తగిన విధంగా రాబడిని ఆర్జించిందని అదానీ స్పష్టం చేసింది. రాజకీయ ఉద్దేశాలతో.. భారత ప్రభుత్వం, ఎల్ఐసీపై దురుద్దేశపూర్వకమైన నివేదికలు విడుదల చేస్తున్నారని అదానీ సంస్థ పేర్కొంది.