Kavitha: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తన తొలి ప్రజా యాత్ర ‘జాగృతి జనం బాట’ను నిజామాబాద్ నుంచి ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ముందుగా.. కవిత తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ.. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీడ నుంచి తనను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత నాలుగైదు నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాల వల్ల నేను ఇక్కడికి రాలేకపోయాను’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం, బీఆర్‌ఎస్ పార్టీ కోసం ఎంతో కాలం పనిచేశానని. కానీ తనకు రావాల్సిన గుర్తింపు దక్కలేదని నిస్సందేహంగా వ్యాఖ్యానించారు. ‘నా ఓటమి స్వంత పార్టీ నేతల కుట్రనే. బీఆర్‌ఎస్ కార్యకర్తలు గుండెల మీద చేయి వేసి ఆలోచన చేయండి. పార్టీలో నాకు గుర్తింపు దక్కలేదు. కుట్రపూరితంగా సస్పెండ్ చేశారు’ అంటూ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో కొందరు కేవలం వ్యక్తిగత లబ్ధి కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసమే కుట్రలు చేస్తున్నారని.. దానిలో భాగంగానే తనను దూరం చేశారని ఆరోపించారు.
పార్టీ సస్పెన్షన్, అంతర్గత కుట్రల నేపథ్యంలో ఆమె ఇకపై తన దారి తాను వెతుక్కుంటానని స్పష్టం చేశారు. ‘మళ్లీ ప్రజల్లోకి రావాలనుకున్నాను. నా తొలి అడుగు నిజామాబాద్ నుంచి మొదలు పెడుతున్నాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి’అంటూ ప్రజలను కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ జనం బాట యాత్ర నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పర్యటనలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, యువతతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు. ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమర వీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, ఫలితం దక్కలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. వారికి న్యాయం చేయించడంలో పూర్తిస్థాయిలో పోరాడలేక పోయినందుకు బహిరంగ క్షమాపణ చెప్పారు. ‘ప్రతి అమర వీరుల కుటుంబానికి కోటి రూపాయల పరిహారం దక్కే వరకు తెలంగాణ జాగృతి పోరాటం కొనసాగిస్తుంది’ అని కవిత డిమాండ్ చేశారు. తాజా వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. కవిత రాజకీయ భవిష్యత్తు, ఆమె ‘జనం బాట’ యాత్ర రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Balmuri Venkat: కవిత ఆరోపణలపై బల్మూరి వెంకట్ పీఎస్‌లో ఫిర్యాదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని..?