Postal Monthly Scheme: పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టల్ శాఖ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పొదుపు పథకాలను అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి వడ్డీ రేట్లను మార్చలేదు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)తో ఆదాయం, భవిష్యత్తులో అవసరమయ్యే మూలధనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ లో చిన్న మొత్తంలో నెలవారీగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వడ్డీ రేటు సంవత్సరానికి 7.4% ఉంటుంది. కనీసం రూ.1000, సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ లో రూ.15 లక్షలు వరకు పొదుపు చేసుకోవచ్చు.
పోస్టల్ మంత్లీ స్కీమ్ లో ఒక వ్యక్తి రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే, రూ.5,550 నెలవారీ ఆదాయం లభిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మొత్తం తిరిగి ఇస్తారు. ఈ పథకానికి 5 సంవత్సరాల లాక్-ఇన్ తో 7.4% వార్షిక వడ్డీ వస్తుంది. జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల పెట్టుబడిపై చందాదారులు రూ.9,250 నెలవారీ ఆదాయం పొందవచ్చు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ ఒక రకమైన టర్మ్ డిపాజిట్ స్కీమ్. ఇది రిస్క్ లేని స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించే పథకం. ముఖ్యంగా పదవీ విరమణ చేసినవారు, సీనియర్ సిటిజన్లు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకంలో వార్షిక వడ్డీని 12 నెలల్లో సమానంగా జమ చేస్తారు.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ పథకంలో రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి 7.4% రేటుతో రూ.66,600 వార్షిక వడ్డీని పొందుతారు. జాయింట్ అకౌంట్ లో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, వార్షిక వడ్డీతో రూ.1,11000 పొందుతారు. ఈ మొత్తాన్ని 12 నెలల్లో సమానంగా విభజిస్తే.. నెలకు రూ.9,250 అందుకోవచ్చు. భార్యాభర్తలిద్దరూ ఉమ్మడి ఖాతాలో ఒక్కొక్కరు రూ.9 లక్షలు చొప్పున పెట్టుబడి పెడితే నెలవారీ ఆదాయం రూ.11,100 అవుతుంది.
10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షుడు ఈ ఖాతా తీసుకోవచ్చు. వ్యక్తిగతంగా, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు.