ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేు. ఇక మన భారతీయ సంస్కృతిలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మన దేశంలోని మహిళలకు బంగారం అంటే అమితమైన ఇష్టం. అది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. వారి ఆత్మగౌరవానికి, సంప్రదాయానికి చిహ్నం. పెళ్లిళ్లు, పుట్టినరోజులు లేదా ఏ చిన్న శుభకార్యం జరిగినా పసిడి మెరుపులు ఉండాల్సిందే. అయితే ఈ బంగారు గనులు మామూలుగా మనం భూగర్భంలో వెలికితీసినట్టు చదువుతాం.. కానీ సముద్ర గర్భంలో కూడా బంగారు గనులు గుర్తించినట్టు సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది.
దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలు ఎలా ఏర్పడుతున్నాయో జర్మనీకి చెందిన మెరైన్ జియాలజీ బృందం తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. భూమిపై బంగారు నిక్షేపాల ఆవిర్భావానికి సంబంధించి దశాబ్దాలుగా వీడని చిక్కుముడిని ఈ పరిశోధన క్లియర్ కట్ గా వివరించింది. న్యూజిలాండ్ సమీపంలోని సముద్ర అంతర్భాగంలో ఉన్న అగ్నిపర్వత ప్రాంతాలు సహజ సిద్ధమైన ‘బంగారు కర్మాగారాలు’గా ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. అక్కడ అద్భుతమైన తళతళ మెరిసే బంగారు గనులు ఉన్నట్టు వారు చెబుతున్నారు.
ఈ ప్రక్రియ భూమి అంతర్భాగం నుంచి మొదలవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. సముద్ర గర్భంలో టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి వేగంగా కదులుతున్నప్పుడు విపరీతమైన వేడి ఉత్పన్నమవుతుంది. ఆ ఒత్తిడికి శిలలు కరిగి ద్రవ రూపంలోకి మారుతాయి. ఈ ద్రవ పదార్థాలే బంగారం తయారీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నట్లు సైంటిస్టులు వివరించారు. ఈ క్రమంలో విడుదలయ్యే రసాయన మూలకాలు పసిడి నిక్షేపాలుగా రూపాంతరం చెందుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
పరిశోధనలో భాగంగా సైంటిస్టుల బృందం లావా చల్లబడటం వల్ల ఏర్పడిన 66 అగ్నిపర్వత నమూనాలను క్షుణ్ణంగా వివరించింది. సాధారణ రాళ్లతో పోలిస్తే ఈ నమూనాల్లో బంగారం గాఢత అత్యధికంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా బంగారం సల్ఫర్ మూలకంతో ముడిపడి ఉంటుంది. భూమి లోపల శిలలు కరిగే సమయంలో ఈ లోహం వేరుపడి లావాతో పాటు పైకి ప్రవహిస్తుంది.
అగ్నిపర్వతాల నుండి విడుదలయ్యే ఈ వేడి ద్రవాలు సముద్రపు అడుగుభాగంలోని హైడ్రో థర్మల్ వెంట్స్ ద్వారా బయటకు వస్తాయి. అక్కడ ఉన్న చల్లటి నీటి ప్రభావంతో బంగారం ఘనీభవించి ఘన ఖనిజ నిక్షేపాలుగా స్థిరపడుతుంది. ఒకప్పుడు సాధారణ ప్రాంతాలుగా భావించిన చోట ఇప్పుడు భారీగా బంగారంతో పాటు రాగి నిక్షేపాలు ఉన్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో బంగారు గనుల అన్వేషణకు కొత్త బాటలు వేయనున్నాయి. భూమి పొరల్లో విలువైన ఖనిజాలు ఎలా రూపుదిద్దుకుంటాయో అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న అపారమైన సహజ వనరులను గుర్తించడానికి ఈ కొత్త సమాచారం దిక్సూచిలా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. పసిడి నిక్షఏపాల ఆవిర్భావంపై సాగిన ఈ అధ్యయనం భూగర్భ శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలవనుంది.
ALSO READ: చంద్రుడిని చుట్టేసి సురక్షితంగా భూమికి.. ఆర్టెమిస్-2 మిషన్ గ్రాండ్ సక్సెస్!