US Accident : ఇద్దరు టీనేజర్ల మృతికి కారణమైన కేసులో అమెరికాలోని ఓ భారతీయ సంతతి వ్యక్తికి గరిష్టంగా 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. అధికంగా మద్యం తాగి, కొకైన్ సేవించి.. రాంగ్ రూట్లో అతివేగంగా కారు నడిపిన ఘటనలో అతను.. టీనెేజర్లను వేగంగా ఢీ కొట్టినట్లు అంగీకరించాడు. దాంతో.. మినోలాలోని నాసావు కౌంటీ కోర్టు అతని ప్రమాదకర ప్రవర్తన, రోడ్డుపై దారుణమైన వేగంతో ప్రయాణించడంతో పాటు ఇద్దరు ప్రాణాలు పోయేందుకు కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ శిక్షను విధించింది. అతనికి శిక్ష విధించే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కోసం వందల సంఖ్యలో స్నేహితులు కోర్టుకు హాజరయ్యారు.
న్యూయార్క్ లోని ఓ నిర్మాణ సంస్థలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న భారతీయ సంతతి యువకుడు అమన్‌దీప్ సింగ్ (36).. తప్పతాగి ఓ రోడ్డు ప్రమాదానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం అంటే 2023లో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో వేగంగా తన పికప్ ట్రక్ నడుపుతూ వచ్చిన అమన్ దీప్.. రాంగ్ రూట్లో ప్రయాణించాడు. పైగా.. అక్కడి రోడ్డుపై ఉన్న 40 mph జోన్‌లో 95 mph (150 kmph) వేగంతో ప్రయాణించాడు. ఈ ఘటనలో జెరిఖోలోని నార్త్ బ్రాడ్‌వేలో జరిగిన టెన్నిస్ టోర్నమెంట్ గెలుపు సంబురాల్లో పాల్గొని సంతోషంగా వస్తున్న ఇద్దరు టెన్నిస్ క్రీడాకారుల్ని పికప్ ట్రక్ తో బలంగా ఢీ కొట్టించాడు. దాంతో.. ఆనందంగా పార్టీ చేసుకున్న స్నేహితులంతా దుఃఖంలో మునిగిపోయారు. అప్పటి వరకు తమతో సంతోషంగా పార్టీలో పాల్గొన్న ఇద్దరు అంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.
అత్యంత వేగంగా పికప్ ట్రక్ నడపడమే కాకుండా.. రాంగు రూట్లో మద్యం మత్తులో రావడాన్ని చాలా మంది ఆగ్రహిస్తున్నారు. ఆ సమయంలో అతను కొకైన్ సైతం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ప్రమాదంలో.. 14 ఏళ్ల ఈతాన్ ఫాల్కోవిట్జ్, డ్రూ హాసెన్‌బీన్ అనే ఇద్దరు మిడిల్ స్కూల్ విద్యార్థులు మరణించగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ప్రమదం తర్వాత అతను అక్కడి నుంచి పరారై.. ఓ చెత్త కుప్ప వెనుక దాక్కున్నాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో అతని రక్తంలో 15 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. అంటే చట్టపరమైన పరిమితికి దాదాపు రెండింతలు ఎక్కువగా మద్యం సేవించాడు. అలాగే.. ప్రమాదానికి కారణమైన అతని ట్రక్ నుంచి మద్యం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీలుసు కోర్టుకు తెలిపారు.
కోర్టులో అతనికి శిక్ష ఖరారవుతుందన్న విషయం తెలుసుకుని అతని స్నేహితులు వందల మంది కోర్టుకు తరలి వచ్చారు. వారందరి కోసం నాసావు కౌంటీ కోర్టులో రెండు గదులు నిండిపోయాయి. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, వందలాది మంది స్నేహితులు కన్నీటి పర్యంతమైయ్యారు. నిందితుడిని చూసిన బాధితుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నా కొడుకును స్కూల్ కి తీసుకెళ్లే బదులు, నేను అతన్ని మార్చురీలో చూసుకోవాల్సి వచ్చింది. ఇది అమానుషమైన హింస అంటూ.. బాధితుల్లోని ఒకరి తండ్రి మిచ్ హాసెన్‌బీన్ కోర్టులో అరిచారు. చనిపోయిన బాలుడి తాత ఒకరు.. నిందితుడిపై అరుస్తూ.. ఇద్దరు అమాయకులను చంపిన తర్వాత తాపీగా పశ్చాత్తాప పడుతున్నావు.. ఇది సరైంది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన పై స్పందించిన నిందితుడు అమన్‌దీప్ సింగ్.. తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. ఇద్దరు బిడ్డల్ని కోల్పోవడం అంటే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని.. తన తప్పిదం వల్ల ఎవరైనా చనిపోతే తానే కారణం వహిస్తానంటూ.. ఏడ్చుకుంటూ కోర్టుకు తెలిపాడు.