వాస్తవానికి బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన అవసరం లేదు, కానీ మంత్రి నారా లోకేష్ ఊరుకోరు కదా. అక్కడ కూడా వైసీపీ పేరు తీసుకొచ్చి ఆ పార్టీ నేతల పరువు జాతీయ స్థాయిలో తీయాలని చూశారు. ఏపీలో వైసీపీ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల వెంట పడిందని, పాపం దయతలచి ప్రజలు ఓట్లు వేస్తే కోలుకోలేని దెబ్బతిన్నారని ఎద్దేవా చేశారు. అలాంటి పని బీహార్ ఓటర్లు చేయొద్దని విన్నవించారు. దీంతో ఏపీలో వైసీపీ నేతలు ఉడుక్కుంటున్నారు.
పాట్నాలో ఎన్నికల ప్రచారం అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది. బీహార్ సర్వతోముఖాభివృద్ధికి మరోమారు బీహార్ యువత ఎన్.డీ.ఏను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశాను. ఏపీలో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీకి అవకాశం ఇవ్వడం వల్ల… pic.twitter.com/HJrKE5EWjV
— Lokesh Nara (@naralokesh) November 9, 2025
పాట్నాలో బిజీబిజీ..
ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నా కూడా గతంలో ఎప్పుడూ ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలో టీడీపీ ఇంత ఉధృతంగా ప్రచారంలో పాల్గొనలేదు. అన్ని పార్టీల మీటింగ్ లు జరిగినప్పుడు చంద్రబాబు హాజరయ్యేవారే కానీ రోడ్ షో లు, ప్రత్యేక మీటింగ్ లంటూ పెద్దగా హడావిడి చేసిన సందర్భాలు లేవు. కానీ బీహార్ ఎన్నికల్లో ఏపీ తరపున నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మూడు రోజులుగా పాట్నాలో మకాం వేసిన లోకేష్ బీహార్ లో ఎన్డీఏ తరపున ప్రచారం చేపట్టారు. స్థానిక పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ డబుల్ ఇంజిని సర్కార్ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు.
వైసీపీపై కౌంటర్లు..
ఏపీలో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీకి అవకాశం ఇవ్వడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని బీహార్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు లోకేష్. అలాంటి పరిస్థితులు బీహార్ లో తెచ్చుకోవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. బీహార్ లో మూడు కారణాల వల్ల ఎన్.డీ.ఏ ని గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారాయన. లీడర్ షిప్ ట్రాక్ రికార్డ్, డబుల్ ఇంజిన్ సర్కారు, ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం అని తెలిపారు. బీహార్ ప్రచారంలో వైసీపీపై లోకేష్ పేల్చిన కౌంటర్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వల్ల రాష్ట్రం మరో పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, కంపెనీలు వెనుదిరిగాయని, వారు చేసిన తప్పుల్ని ఇప్పుడు సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నట్టు లోకేష్ వివరించారు. బీహార్ కి ఆ పరిస్థితి రొవొద్దని, బీహార్ ప్రజలు ఆ పరిస్థితిని రానీయొద్దని విజ్ఞప్తి చేశారు.
బీహార్ సంగతేంటి?
బీహార్ లో ఈసారి పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎన్డీఏ కూటమి విజయం ఏమంత సులభం కాదని అంటున్నారు. కాంగ్రెస్ టీమ్ అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతోంది. ఈ దశలో బీజేపీ కూడా కూటమి తరపున బలంగా ప్రచారం నిర్వహిస్తోంది. పక్క రాష్ట్రాలనుంచి కీలక నాయకుల్ని తీసుకు వచ్చి ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఏపీ నుంచి నారా లోకేష్ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పై సూటి విమర్శలు చేస్తూనే.. రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల వచ్చే ఉపయోగాలని వివరించి చెబుతున్నారు. ముఖ్యంగా యువత, పారిశ్రామిక వర్గాలను టార్గెట్ చేస్తూ లోకేష్ ప్రచారం సాగుతోంది. ఆయా వర్గాల్లో ఎన్డీఏ ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచేలా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి లోకేష్ ప్రచారం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.
Also Read: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు