Telugu Girl Murdered in US: గత వారం నుండి కనిపించకుండా పోయిన నిఖిత గోడిశాల అనే 27 ఏళ్ల తెలుగు యువతి, అమెరికాలోని మేరీల్యాండ్‌లోని కొలంబియాలో తన స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 7 గంటల తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
ప్రాథమిక దర్యాప్తులో నిఖిత డిసెంబర్ 31న అర్జున్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిందని, ఆ తర్వాత అతని అపార్ట్‌మెంట్ నుండి ఆమె కనిపించకుండా పోయిందని తెలిసింది.
న్యూయర్ వేడుకల తర్వాత నికిత కనిపించడంలేదని నికిత మాజీ లవర్ అర్జున్ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31న చివరి సారిగా తన అపార్ట్ మెంట్‌లో కనిపించిందని చెప్పాడు. ఆ తర్వాత అతడు జనవరి 2న భారత్ కి తిరిగి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి అర్జున్ ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా నికిత విగత జీవిగా పడిఉంది. తన శరీరంపై గాయాలు చూసి నికిత హత్యకు గురైనట్లు పోలీసులు నిర్దారించారు.
వెంటనే నికిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. డిసెంబర్ 31న హత్యకు గురైనట్లు తేలింది. భారత్‌కు పారిపోయిన అర్జున్‌ను గుర్తించేందుకు ఫెడరల్ అధికారుల సహాయంతో గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు నికిత కనిపించడంలేదని వెతుకుతున్న తన స్నేహితులకు ఆమె హత్యకు గురైందని తెలిసి షాక్ అయ్యారు. నికిత మృతి చెందిన విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నిఖిత గోడిశాల హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసి, ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తోంది. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో చదువుకున్నట్లు సమాచారం.