Road Accident: కొత్త ఏడాది వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గలేదు. సగటున రోజుకు నాలుగైదు రోడ్డు ప్రమాదాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీని బలంగా ఢీ కొట్టింది టవేరా వాహనం. ఘటనలో పలువురు గాయపడ్డారు.
జగిత్యాలలో ఆర్టీసీ బస్సుని ఢీ కొన్న టవేరా
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సమీపంలో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెట్‌పల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టవేరా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టవేరా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. కారులోని వారంతా గానుగాపూర్ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఘటన సమయంలో వాహనంలో దాదాపు 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుగుపొరుగువారు గాయపడినవారిని కరీంనగర్, మెట్‌పల్లి, నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించి ఆ రూట్లో ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది లారీ
మరోవైపు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి వద్ద తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టింది ఓ లారీ. ఈ ఘటనలో స్వల్పగాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. లారీ డ్రైవర్‌కి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రావాల్సివుంది. పొగమంచు కారణంగా ఎదురు వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ALSO READ: బాలికపై వృద్ధుడు లైంగిక దాడి.. సీన్ కట్ చేస్తే..