Begum Bazaar: స్వేచ్ఛ బ్యూరో: వరుసగా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 30లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 2.14లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కిషన్ బాగ్ ఎన్ఎంగూడ వద్ద ఫుట్ పాత్ పై నివాసముంటున్న అమర్ సోన్ కాంబ్లే (20) చిన్నతనంలోనే చెడు స్నేహాలతో అన్ని రకాల దుర్వ్యసనాలకు బానిసయ్యాడు. ఫంక్షన్ హాళ్లలో వెయిటర్ గా చేస్తున్న పని ద్వారా జల్సాలు తీర్చుకోవటానికి అవసరమైన డబ్బు రాక పోతుండటంతో దొంగతనాల బాట పట్టాడు. ఈనెల 5న గోషామహల్ హిందీనగర్ లోని ఓ ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి నగలు, 10లక్షల నగదును తస్కరించాడు.
ఈ మేరకు బాధితుడు కృష్ణ ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన బేగంబజార్ సీఐ భరత్ కుమార్ కేసులు నమోదు చేసి డీఎస్ఐ జగదీశ్వర్ రావుతోపాటు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. దీంట్లో భాగంగా చోరీ జరిగిన ఇంటి వద్ద ఉన్నవాటితోపాటు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషించటం ద్వారా అమర్ ను గుర్తించారు. గాలింపు చేపట్టి ఆదివారం రాత్రి అతన్ని అరెస్ట్ చేసి నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. తక్కువ వ్యవధిలోనే నిందితున్ని అరెస్ట్ చేసిన సిబ్బందిని డీసీపీ చంద్రమోహన్ అభినందించారు. నిందితునిపై గతంలో దొంగతనాల కేసులతోపాటు పోక్సో చట్టం ప్రకారం కూడా ఓ కేసు ఉన్నట్టు చెప్పారు.
Also Read: సీఎం విజయ్‌కు తొలి పరీక్ష.. త్రిభాషా ఫార్ములాను ‘దళపతి’ ఎలా డీల్ చేయబోతున్నారు?