Vijay Government: తమిళ గడ్డపై టీవీకే తొలిసారి అధికారంలోకి వచ్చాక, హీరో విజయ్.. సీఎం విజయ్‌గా మారాక.. తమిళనాడు ప్రభుత్వానికి పాలనా పరంగానూ, విధాన పరంగానూ, సిద్ధాంతపరంగానూ ఎదురైన సవాల్ ఇది. దీనిని.. విజయ్ సర్కార్ ఎలా డీల్ చేయబోతోందనేదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో.. ఈ దేశ విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు.. వచ్చే జూన్ 1 నుంచి తొమ్మిదో తరగతిలో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని డిసైడ్ చేసింది. దాంతో.. 60 ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లైంది. కనీసం రెండు భారతీయ భాషలతో పాటు విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడంతో మాతృభాషకు మేలు జరగనుంది. అయితే, ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక ఎత్తైతే.. దక్షిణాదిలోని తమిళనాడులో మాత్రం మరో ఎత్తు.
ఈ పరిణామం.. తమిళ నేలపై సరికొత్త రాజకీయ, సామాజిక చర్చకు తెరలేపింది. దశాబ్దాలుగా త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కేవలం ద్విభాషా సూత్రాన్ని మాత్రమే నమ్ముకున్న తమిళనాడు.. ఇప్పుడు ఏం చేయబోతోంది? అనేదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్పుడు అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయ్. కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిగా విజయ్.. ఈ వివాదాస్పద అంశాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఆయన స్టాండ్ మారుతుందా? లేక పాత పంథానే కొనసాగిస్తారా? అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య భాషాపరమైన బంధాన్ని బలోపేతం చేయడానికి.. 1968లో కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ త్రిభాషా సూత్రాన్ని తెచ్చింది. దీని ప్రకారం.. విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ కింద.. మాతృభాష గానీ, ప్రాంతీయ భాష గానీ నేర్చుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ బెల్ట్ స్టేట్స్‌లో అయితే, ఇంగ్లీష్ గానీ, మరేదైనా ఆధునిక భారతీయ భాష గానీ నేర్చుకోవాలి. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాదిలో.. హిందీ గానీ, ఇంగ్లీష్ గానీ నేర్చుకోవాలి. ఇక.. మూడవ భాష కింద.. హిందీ మాట్లాడే హరాష్ట్రాల్లో ఇంగ్లీష్ గానీ, ఆధునిక భారతీయ భాష గానీ నేర్చుకోవాలి. హిందూ మాట్లాడని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ గానీ, ఒక ఆధునిక భారతీయ భాష గానీ నేర్చుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే.. హిందీయేతర రాష్ట్రాల్లో మాతృభాష, ఇంగ్లీష్‌తో పాటు హిందీని కూడా ఓ భాషగా నేర్పించాలనేదే దీని వెనకున్న ప్రధాన ఉద్దేశమనే వాదనలు వినిపిస్తున్నాయ్.
భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని మొదటి నుంచి అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన ఏకైక రాష్ట్రం తమిళనాడు. 1960ల్లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం.. ఆ రాష్ట్ర రాజకీయాల రూపురేఖలనే మార్చేసింది. కాంగ్రెస్‌ని గద్దె దించి ద్రవిడ పార్టీలు అధికారంలోకి రావడానికి ఈ భాషా ఉద్యమమే కారణం. 1968లో అప్పటి సీఎం అన్నాదురై.. తమిళనాడు అసెంబ్లీలో ఓ చారిత్రక తీర్మానం చేశారు. తమిళనాడులో కేవలం తమిళం, ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయని, హిందీకి చోటు ఉండదని స్పష్టం చేస్తూ.. టూ లాంగ్వేజ్ ఫార్ములా తెచ్చారు.
Also Read: ముంబయి హైవేపై ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్.. 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
అప్పటి నుంచి ఇప్పటివరకు.. కరుణానిధి, జయలలిత, స్టాలిన్.. ఇలా ఎవరు సీఎం సీట్లో ఉన్నా.. ఈ విధానాన్ని పైసా కూడా మార్చలేదు. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా తమిళనాడు ప్రభుత్వం మాత్రం తన పంథా వీడలేదు. స్టాండ్ మార్చుకోలేదు. అయితే, ఇన్నాళ్లూ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కాగితాలకే పరిమితమైంది. కానీ, ఇప్పుడు సీబీఎస్ఈ దీనికి చట్టబద్ధమైన గడువు విధించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
సీబీఎస్ఈ నిర్ణయం ప్రకారం.. 9,10 తరగతుల విద్యార్థులు ఇప్పటివరకు రెండు భాషలు చదివితే సరిపోయేది. ఇకపై.. మూడు భాషలు చదవాలి. అందులో కనీసం రెండు భారతీయ భాషలు అయి ఉండాలి. మళ్లీ ఇంటర్మీడియట్ లెవెల్‌లో ఒక భాష స్థానంలో రెండు భాషలు చదవాల్సి ఉంటుంది. దీనివల్ల.. తమిళనాడులోని సీబీఎస్ఈ స్కూళ్లలో చదివ విద్యార్థులు తమిళం ఇంగ్లీష్‌తో పాటు కచ్చితంగా మూడో భాషగా హిందీనో, సంస్కృతాన్నో ఎంచుకోవాల్సిని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది.. ద్రవిడ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తమిళనాడులో ఇప్పుడు పొలిటికల్ డైనమిక్స్ మారాయ్. దశాబ్దాలుగా ఏలిన డీఎంకే, ఏడీఎంకేలకు భిన్నంగా.. సరికొత్త రాజకీయ శకం ప్రారంభమైంది. స్టార్ హీరో విజయ్.. సీఎం సీట్లో కూర్చున్నాక ఎదుర్కొంటున్న అత్యంత సున్నితమైన, జాతీయ స్థాయి సవాల్ ఇదే! మరి.. విజయ్ ఏం చేయబోతున్నారు?
దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న అత్యంత సున్నితమైన సెంటిమెంట్ భాషా విధానమే. దేశంలో త్రిభాషా సూత్రాన్ని దరిచేరనివ్వని ఏకైక రాష్ట్రం తమిళనాడు ఒక్కటే. కానీ, టీవీకే అధికారంలోకి వచ్చాక.. తమిళనాడులో పొలిటికల్ డైనమిక్స్ మారిపోయాయ్. ఈ క్రమంలో వచ్చే జూన్ 1 నుంచి త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే.. ఇప్పుడు సీఎం విజయ్ ముందున్న బిగ్ ఛాలెంజ్‌గా కనిపిస్తోంది. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడంలో.. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎప్పుడూ రాజీ పడలేదు.
సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో.. కేంద్రం త్రిభాషా సూత్రాన్ని రుద్దాలని చూస్తోందని గట్టిగానే విమర్శలు గుప్పించాయ్. మొన్నటిదాకా అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్, మాజీ సీఎం స్టాలిన్ కూడా త్రిభాషా సూత్రంపై కేంద్రంతో రాజకీయ ఘర్షణకు దిగింది. పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. దాంతో.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ఏం చేయబోతున్నారనేది ఇంట్రస్టింగ్ ఎలిమెంట్‌గా కనిపిస్తోంది. ఈ అంశంలో.. ఆయన ముందున్న ఆప్షన్లు ఏంటి అనే చర్చ మొదలైంది.
సీఎం విజయ్ ముందున్న ఫస్ట్ ఆప్షన్.. మరో ఆలోచన లేకుండా ద్రవిడ సెంటిమెంట్‌కి జై కొట్టడమే! ఎందుకంటే.. తమిళనాడు రాజకీయాల్లో నిలబడాలంటే.. తమిళ భాషా సెంటిమెంటే కీలకం. ఆ ఎమోషనే.. అక్కడి రాజకీయాలకు కొన్ని దశాబ్దాలుగా ఇంధనంలా మారి నడిపిస్తోంది. పైగా.. విజయ్ తన పార్టీ సిద్ధాంతాల్లో ద్రవిడ జాతీయవాదాన్ని, తమిళ గుర్తింపుని బలంగా ప్రస్తావించారు. కాబట్టి, ఆయన కూడా పాత సీఎంల మాదిరిగానే.. సీబీఎస్ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది.
కేంద్రం బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే ఊరుకోబోమని సీఎం విజయ్ గళం విప్పితే.. తమిళ ప్రజల్లో పూర్తి స్థాయి తమిళ నాయకుడిగా ఆయనకు గుర్తింపు దక్కుతుంది. ఇక, టీవీకే ప్రభుత్వం ముందున్న రెండో ఆప్షన్.. కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించి సీబీఎస్ఈ చెప్పినదానికి ఓకే అనడమే! మారుతున్న కాలంతో పాటు గ్లోబల్, నేషనల్ లెవెల్లో విద్యార్థులు రాణించాలంటే.. ఎక్కువ భాషలు రావడం ప్లస్ అవుతుందని సీఎం విజయ్ భావిస్తే.. త్రిభాషా విధానానికి ఓకే చెప్పొచ్చు. అడ్డంకులు సృష్టించకుండా మినహాయింపు ఇవ్వొచ్చు. కానీ, ఇలా చేస్తే.. డీఎంకే, ఏడీఎంకే లాంటి ప్రతిపక్ష పార్టీలు.. సీఎం విజయ్ కేంద్రానికి లొంగిపోయారనో, తమిళ ద్రోహి అనో కార్నర్ చేసే ప్రమాదముంది.
Also Read: శెట్టిపల్లి ప్రజలకు గుడ్ న్యూస్.. జగన్ అరాచకాలపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు!
మూడో ఆప్షన్‌గా.. కోర్టు మెట్లు ఎక్కడమే! కేంద్రంతో నేరుగా ఘర్షణ పడకుండా, తమిళ సెంటిమెంట్‌ని దెబ్బతీయకుండా ఉండటానికి.. విజయ్ సర్కార్ చట్టపరమైన మార్గాలను ఎంచుకోవచ్చు. సీబీఎస్ఈ నిర్ణయంపై స్టే తేవడమో, తమిళనాడుకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడమో చేయొచ్చు. దీనివల్ల సీఎం విజయ్ తమిళ భాషా రక్షణ కోసం, తమిళుల అస్తిత్వం కోసం పోరాడుతున్నారనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. సీఎం విజయ్ ముందున్న నాలుగో ఆప్షన్.. త్రిభాషా సూత్రాన్ని ఒప్పుకుంటూనే, హిందీ స్థానంలో ఏవైనా ఇతర భాషలను ఎంచుకునే స్వేచ్ఛని విద్యార్థులకే వదిలేసే ఆప్షన్ కూడా ఇవ్వొచ్చు. హిందీని రుద్దకుండా.. విద్యార్థులక ఛాయిస్‌కే వదిలేస్తున్నామని కేంద్రానికి, తమిళ ప్రజలకు చెప్పొచ్చు.
తమిళ సెంటిమెంట్ అనేది.. ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు. అది.. ఆ నేల డీఎన్ఏలోనే ఉంది. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడే చాలా క్లియర్‌గా చెప్పారు. తన సిద్ధాంతం సామాజిక న్యాయం, తమిళ జాతీయవాదం అని! అందువల్ల.. టీవీకే సర్కార్ తమిళ సెంటిమెంట్‌ని దెబ్బతీసే నిర్ణయాన్నీ తీసుకోదనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువకాలం కొనసాగాలంటే.. తమిళ పట్టు తప్పనిసరి. తమిళనాడులో రాజకీయ తరాలు మారినా, నాయకులు మారినా.. ఆ గడ్డపై భాషకున్న ప్రాధాన్యత మారలేదు. విజయ్ తన సినీ గ్లామర్‌ని దాటుకుని.. పొలిటికల్ గ్లామర్‌ను నిలబెట్టుకోవాలంటే.. తమిళ సంస్కృతిని కాపాడుకుంటూనే, విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా చేయాలి. సీబీఎస్ఈ డెసిషన్‌పై సీఎం విజయ్ తీసుకోబోయే నిర్ణయమే ఆయన రాజకీయ పరిణతికి, భవిష్యత్తు తమిళనాడుకు నిజమైన పరీక్ష కానుంది!
త్రిభాషా సూత్రం ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు. దీని వెనుక పెద్ద హిస్టరీనే ఉంది. 1964-66లో విద్యా కమిషన్ తొలిసారి త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. దానినే కొఠారి కమిషన్ అనేవారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1968లో.. ఈ కమిషన్ జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1986లో దీని ప్రస్తావన తీసుకురాగా, 1992లో పీవీ నరసింహారావు సర్కారు కొన్ని సవరణలు చేసింది. భాషా వైవిధ్యాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించేలా మార్పులు తెచ్చింది.
మాతృభాష, అధికారిక భాష, ఆధునిక భారత భాషలు , ఐరోపా భాషలను చేర్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం.. భారతీయ భాషలు, ఇంగ్లీష్ కాకుండా.. కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లో దేనినైనా విద్యార్థులు నేర్చుకోవచ్చు. ఇక్కడున్న మెలిక ఏమిటంటే.. ఇంగ్లీష్‌ని కూడా విదేశీ భాషగా చెబుతున్నారు. మూడు భాషల్లో ఒకటే విదేశీ భాషగా ఉండాలి కాబట్టి.. ఇంగ్లీష్‌ని, మరో విదేశీ భాషను ఎంచుకోవాలనుకున్న వారికి ఇబ్బందులు తప్పేలా లేవు.
మూడు భాషలకు ప్రత్యేక పుస్తకాలు అందుబాటులోకి వచ్చేవరకు 2026-27 విద్యా సంవత్సర ఆరో తరగతి ఆర్3 పుస్తకాలను ఆయా భాషల కోసం వాడుకోవాలని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ త్రిభాషా విధానం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుంది. అయితే, తమిళనాడులో కొత్త తరం నాయకుడిగా, సరికొత్త విజన్‌తో వచ్చిన సీఎం విజయ్.. ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాపై ఎలా రియాక్ట్ అవుతారనేదే ఆసక్తి రేపుతోంది. ఆయన తీసుకునే నిర్ణయం.. తమిళనాడు భవిష్యత్ రాజకీయాలనే కాదు, విద్యార్థుల భవితవ్యాన్ని కూడా శాసించబోతోంది.
Also Read: సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!