AP Fake Liquor Case: ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ మద్యం గుట్టు రట్టు.. అన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఎవరు తయారు చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారన్న విషయాలను పక్కన పెడితే క్వాలిటీ మద్యం అందిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీకి ఇలాంటి ముఠాలకు చెక్ పెట్టడం సవాల్ గా మారింది. ఇదేనా క్వాలిటీ లిక్కర్ అని వైసీపీ నేతలు ఫైర్ అవుతుండగా.. ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని చంద్రబాబు సీరియస్ అయ్యారు. మరి మధ్యలో ఏం జరిగింది?
ఏపీలో కల్తీ మద్యం చుట్టూ పాలిటిక్స్..
ఏపీలో నకిలీ లిక్కర్ రాకెట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ సోదాలు సరిగా చేస్తే ప్రతి నియోజకవర్గంలో బయటపడేట్లు సీన్లు కనిపిస్తున్నాయి. అసలు ఏది కల్తీ, ఏది నకిలీ అన్నది గుర్తుపట్టని విధంగా మారింది. కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు చాలా సార్లు ప్రచార సభల్లో మాట్లాడారు.
క్వాలిటీ లిక్కర్ ఇదేనా అని వైసీపీ ప్రశ్నలు..
స్వయంగా ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబే స్వయంగా క్వాలిటీ లిక్కర్ ఇస్తామని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో కథ మారుతోంది. లిక్కర్ సిండికేట్లు పుట్టగొడుగుల్లా తయారయ్యాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. సీమ టూ ఉత్తరాంధ్ర ఎక్కడి వరకు చూసినా నకిలీ లిక్కర్ ముఠాల బాగోతం బయటపడుతోంది. నాణ్యమైన మద్యం హామీ ఇచ్చిన కూటమి పార్టీకి ఇప్పుడు ఇలాంటి కల్తీ ముఠాలకు చెక్ పెట్టడం పెద్ద సవాల్ గా మారింది.
జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడు సస్పెండ్
ఏపీలో ఇప్పటికే వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ స్కాంపై దర్యాప్తు జరుగుతోంది. అరెస్టులు కూడా నడుస్తున్నాయి. ఈ మ్యాటర్ ఇలా ఉండగానే.. కూటమి ప్రభుత్వ హయాంలో లిక్కర్ మాఫియా లీలలు బయటకు వస్తుండడంతో సీరియస్ గా తీసుకుంటోంది. ఉపేక్షిస్తే ఇది కూటమి ప్రభుత్వానికే మాయని మచ్చగా మారుతుందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులకు పార్టీ షాక్ ఇచ్చింది. దాసరిపల్లి జయచంద్రరెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో వారి పాత్రపై విచారణ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇది ఇప్పటికే ముగిసేలా కనిపించడం లేదు.
ములకల చెరువు ఘటన తీవ్ర సంచలనం..
ములకలచెరువు ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక్కడ ఏకంగా నకిలీ మద్యం ప్లాంట్ లనే గుర్తించారు. ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతోందా అని అంతా ఆశ్చర్యపోయారు కూడా. ఈ కల్తీ లిక్కర్ తో మొదటగా జనం ప్రాణాలకు ఇబ్బంది. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయానికి గండి. సో ఓవైపు వైసీపీ హయాంలో లిక్కర్ స్కాంకు పాల్పడ్డ వారి అరెస్టులు, విచారణలు కొనసాగుతుంటే.. ఇంకోవైపు ఇప్పుడు కల్తీమద్యం చుట్టూ పొలిటికల్ ఫైట్ పెరుగుతోంది. ఏపీలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మద్యమే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతి 3 బాటిల్స్ లో ఒకటి కల్తీనే అంటున్నారు. తమ పోరాటం వల్లే ములకలచెరువు మద్యం ఇష్యూ బయటపడిందంటున్నారు.
కల్తీ మద్యానికి కారణం జగనే అంటున్న టీడీపీ
అసలు కల్తీ మద్యం, మరణాలకు కారణం జగనే అని టీడీపీ నేతలు అంటున్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించకుండా చోద్యం చూసే పరిస్థితి తమ హయాంలో లేదని గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలోనే లిక్కర్ కల్తీకి తెరలేపాలంటున్నారు. లిక్కర్ స్కాం నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు కొందరు కల్తీ మద్యం పేరుతో ప్రయత్నిస్తున్నారంటున్నారు. ప్రతిచోటా ఏదో కుటీర పరిశ్రమలా.. నకిలీ మద్యం కోసం కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నవి బయటపడుతుండడం సంచలనంగా మారుతున్నాయి.
ఎవరైనా మద్యం రేట్లపై ఆఫర్ అని ప్రకటిస్తే పక్కాగా అనుమానించాల్సిందే. ఎక్కడి ఆఫర్.. ఎవరి ఆఫర్.. ఆఫర్లు ఇస్తే షాపులకు మిగిలేది ఏంటి? ఇలాంటివన్నీ ఆలోచించాలి. పైగా ఎక్సైజ్ శాఖ కూడా మామూళ్ల మత్తులో ఉంటే కష్టమే. ప్రజల ప్రాణాలే గాల్లో కలిసే పరిస్థితి ఉంటుంది. ములకల చెరువు ఇష్యూ చుట్టూ పొలిటికల్ బ్లేమ్ గేమ్ పెరుగుతోంది? ఎవరు ఈ జనార్ధన్ రావు, జయచంద్రారెడ్డి? కల్తీ లిక్కర్ డంప్ గోడౌన్లు ఎలా దొరుకుతున్నాయి? విజయవాడకు చెందిన అద్దేపల్లి జనార్దన్‍రావు, అతని అనుచరుడు రాజు కలిసి ములకలచెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బెల్ట్ షాపులకు, వైన్స్ లకు ఈ లిక్కర్ సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ధర కంటే తక్కువకే ఇస్తూ అందరినీ ఇటువైపే ఆకర్షిస్తున్నారు. జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
ఎన్‌ఫోర్స్ మెంట్ చెకింగ్ లో దొరికిన కల్తీ మద్యం
పెద్దతిప్ప సముద్రం మండలంలో ఇటీవల అన్నమయ్య జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెకింగ్స్ చేశారు. ఈ క్రమంలో నకిలీ లిక్కర్ తరలిస్తున్న వెహికిల్ ను ఆపారు. సీసాల మీది లేబుల్స్ ను స్కాన్ చేయడంతో నకిలీవని తేలింది. దీంతో అక్రమ మద్యం తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలింది. మొత్తం 15 వేల నకిలీ లిక్కర్ సీసాలు, 1,050 లీటర్ల స్పిరిట్ క్యాన్లు, 1,500 లీటర్ల నకిలీ మద్యం, 10 వేల ఖాళీ మందు బాటిళ్లు, మూతలు, స్టిక్కర్లు, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
నకిలీ మద్యంపై సీఎం సీరియస్..
ఈ ఇష్యూ చినికి చినికి గాలివానగా మారడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీకి చెందిన ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు నకిలీ మద్యం కేసును అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. నిందితులు ఎంతటివారైనా వదలొద్దని, కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటుచేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. సో కల్తీ లిక్కర్ తయారు చేసే వారు ఎవరైనా సరే తేలిగ్గా తీసుకోవద్దని చెప్పడాన్ని టీడీపీ డిఫెండ్ చేసుకుంటోంది.
నకిలీ మద్యం కేసులో జనార్థన్ రావు A1
ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో అద్దేపల్లి జనార్దన్‌రావు ఏ1గా ఉన్నాడు. విజయవాడలో అతని పేరిట ANR బార్ లైసెన్స్ ఉంది. కల్తీ మద్యం తయారీ కోసమే అతను ములకలచెరువుకు వచ్చాడని, పెద్దతిప్పసముద్రంలోని ఆంధ్రా వైన్స్, ములకలచెరువులోని రాక్‌స్టార్ వైన్స్‌కు ఆ సరకును సరఫరా చేశాడని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ రెండు వైన్‌షాపులను సీజ్ చేశారు. ANR బార్ ను కూడా సీజ్ చేశారు. జనార్దన్‌రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎక్సైజ్ అధికారులు. మొత్తంగా కల్తీ మద్యంలో ఇన్వాల్వ్ అయిన 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశారు. జనార్దన్‌రావు ఆదేశాల మేరకే తాము నకిలీ మద్యం తయారీ, సరఫరా చేశామని అరెస్టైన నిందితులందరూ వాంగ్మూలాలిచ్చారు. ములకలచెరువులోని రాక్‌స్టార్ వైన్స్ లైసెన్స్ టి.రాజేశ్ పేరిట ఉంది. అతని వాహనంలోనే నకిలీ మద్యం రవాణా చేస్తుంటే పట్టుకున్నారు. కల్తీ లిక్కర్ ను ఎక్కడెక్కడకు సరఫరా చేశారో ఎంక్వైరీ చేస్తున్నారు.
ఎన్నికల తర్వాత కల్తీ లిక్కర్ విస్తరించారా?
ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే.. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని అద్దేపల్లి జనార్ధన్ రావు గోడౌన్ లో భారీగా కల్తీ లిక్కర్ డ్రమ్ములు, లిక్కర్ ఖాళీ సీసాలు, కల్తీ మద్యం తాజాగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇదో సంచలనంగా మారింది. ఇలాంటి కల్తీ లిక్కర్ డంపులు ఇంకెన్ని ఉన్నాయోనన్న డౌట్లు పెరుగుతున్నాయి. నిజానికి ఈ ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంలో తవ్వే కొద్దీ లింకులు చాలానే ఉన్నాయి. ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నడుపుతున్నాడు జయచంద్రారెడ్డి. ఈయన వ్యాపారంలో జనార్ధన్‌రావు కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. జయచంద్ర, జనార్ధన్ ఇంజినీరింగ్ క్లాస్ మేట్స్. కల్తీ లిక్కర్ దందాకు పాత స్నేహం బాగా ఉపయోగపడిందని అనుమానిస్తున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత లిక్కర్ బిజినెస్‌ను మరింత విస్తరించినట్లు తెలిసింది. గత ఎన్నికల ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి జయచంద్రారెడ్డి వచ్చారు. తంబళ్లపల్లె నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు కూడా. ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఆర్థిక వ్యవహారాలు జనార్ధన్‌రావు చూసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
Also Read: పెళ్లైన కొద్ది రోజులకే.. గడ్డి మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం..
ఎన్నికల తర్వాత కల్తీ లిక్కర్ దందాను జనార్ధన్ రావు అండ్ కో కార్యరూపంలోకి తీసుకొచ్చారంటున్నారు. జయచంద్రారెడ్డికి సన్నిహితుడైన సురేంద్రనాయుడు, పీఏ రాజేశ్‌తో కలిసి తంబళ్లపల్లెలో కల్తీ లిక్కర్ బిజినెస్ నడుపుతున్నట్లు లెక్కలు తేలుతున్నాయి. ములకల చెరువుతో పాటే తాజాగా విజయవాడ ఇబ్రహీంపట్నంలోనూ భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. పిటీఎం, కురబలకోట, కొత్తకోట మండలాల్లోనూ కల్తీ మద్యం మూలాలు ఉన్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలిలో అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేశారు. వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ములకలచెరువులో కల్తీ మద్యం తయారు చేసిన ఇల్లు శ్రీనివాస్ పేరుమీద అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ఆయన్ను ఈ కేసులో ఏ12గా చేర్చారు. సో ఇది పార్టీలకు అతీతంగా కల్తీ లిక్కర్ దందా కొనసాగుతున్నట్లుగా డౌట్లు పెరుగుతున్నాయి.
Story By Vidhya Sagar, Bigtv