Road Accident: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివార్లలో అర్థరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే అతివేగం, అజాగ్రత్తకు తోడు ఊహించని పరిణామాల వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రహదారిపై ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా జరిగిన ఈ ఘోరాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ప్రమాద వివరాల్లోకి వెళితే.. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆ వాహనాన్ని బలంగా తాకుతూ ముందుకు వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. జరిగిన నష్టంపై ఒకరినొకరు నిలదీసుకుంటూ, తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. రహదారిపైనే ఉండి వారు వాదులాడుకుంటున్న సమయంలో మృత్యువు వెనుక నుంచి లారీ రూపంలో విరుచుకుపడింది.
వీరు వాదించుకుంటున్న విషయాన్ని గమనించని మరో వేగంగా వచ్చిన లారీ, రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇద్దరు డ్రైవర్లు రెండు భారీ వాహనాల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతులను శ్రీనివాస్, బంగారయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: చౌటుప్పల్‌లో విషాదం.. ప్రేమ విఫలమైందని వీడియో తీసి పెట్రోల్ పోసుకున్న యువకుడు, చివరికి
సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై వాహనాలు నిలిపేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, వెనుక నుంచి వచ్చే వాహనాలకు సిగ్నల్స్ ఇవ్వకపోవడమే ఈ ప్రాణనష్టానికి ప్రధాన కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.