Car Fire: సంగారెడ్డి జిల్లాలో బుధవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. సదాశివపేట మండలం నందికంది సమీపంలోని 65వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపై కారు ప్రయాణిస్తుండగా, ఇంజిన్ భాగం నుండి అకస్మాత్తుగా పొగలు రావడం డ్రైవర్ గమనించారు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాహనాన్ని వెంటనే రహదారి పక్కకు నిలిపివేశారు. కారులోని వారు హుటాహుటిన బయటకు దిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. వారు దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. జాతీయ రహదారిపై మంటలు ఎగిసిపడటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
నడిరోడ్డుపై కారు దగ్ధం
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది 65వ జాతీయ రహదారిపై ఘటన
అప్రమత్తమై కారును రోడ్డును పక్కన నిలిపివేయడంతో తప్పిన పెను ప్రమాదం
ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం
Car set on fire on National Highway 65 at Nandikandi, Sadashivapeta… pic.twitter.com/9Vv9CLMzr3
— BIG TV Breaking News (@bigtvtelugu) March 4, 2026