Cases filed on Hyderabad Chitrapuri colony committee members: గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగానికి చెందిన అల్పాదాయ వర్గాల వారికి కేటాయించవలసిన చిత్రపురి కాలనీ ప్లాట్ల పై వివాదం కొనసాగుతోంది. అసలు సినీ రంగానికి చెందని వాళ్లకు సైతం మినిమం రేటుకే అమ్మారని సొసైటీ సభ్యులపై పలువురు సినీ కళాకారులు ఆరోపిస్తూ వచ్చారు. దీనిపై ఆందోళనలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ చెరువులు, నాలాలు కబ్జా చేసినవారిపై హైడ్రా ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. దీనితో ఉలిక్కిపడ్డ సినీ పరిశ్రమ ఇప్పుడు అనుమతులు అక్రమంగా తీసుకుని కట్టుకున్న తమ విల్లాలు, అపార్టుమెంట్ల విషయంలో ఆందోళన చెందుతున్నారు .అయితే హైడ్రా గత నెలనుంచి సీఎం ఆదేశాల మేరకు దూకుడు ప్రదర్శిస్తోంది.
225 విల్లాలకు నోటీసులు
గత నెలలో మణికొండ పరిధిలోని చిత్రపురి కాలనీకి చెందిన 225 విల్లాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ విల్లాలన్నీ అనుమతులు లేకుండా నిర్మించారని మణికొండ మున్సిపల్ అధికారులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో గతంలో నిర్వహించిన సొసైటీ పాలక వర్గం దొంగచాటుగా నిర్మాణాలకు అనుమతులు పొందిందని అధికారులు తేల్చారు. మున్సిపల్ అధికారులకు జీ ప్లస్ వన్ కి అనుమతులు పొంది అక్రమంగా జీ ప్లస్ టూ నిర్మాణాలు చేశారని మున్సిపల్ అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఖాజాగూడ చిత్రపురి కమిటీ పై హైదరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW) ఏకంగా మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. 46/2024, 47/2024m 52/2024 అంటూ మూడు ఎఫ్ఐఆర్లు సైబరాబాద్ డీసీపీ నమోదు చేశారు. దీని ప్రకారం ప్రస్తుత కమిటీ మరియు పాత కమిటీలో మెంబర్లుగా ఉండి కీలక పాత్ర వహించిన 21 మందిపై కేసు నమోదు చేసి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేశారు.
నాన్ బెయిలబుల్ కేసులు
సెక్షన్ 1208 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేశామని సైబరాబాద్ డీసీపీ తెలిపారు. కేసులు నమోదయినవారిలో ప్రముఖ నిర్మాతలు, నటులు ఉన్నారు. వారిలో అనిల్ కుమార్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, సత్యన్నారాయణ దోరా, టీ. లలిత, ఆలహరి వివి ప్రసాద్, కొంగర రామకృష్ణ, దీప్తి వాజపేయి, అనిత నిమ్మగడ్డ, రఘు బత్తుల, కాదంబరి కిరణ్, మహేంద్ర రెడ్డి, వినోద్ బాల, జెల్లా మధుసూదన్, పీఎస్ కృష్ణ మోహన్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావ, కె.రాజేశ్వరరెడ్డి, చంద్రమధు, దేవినేని బ్రహ్మానందరావు, కొల్లి రామకృష్ణ, కె.ఉదయభాస్కర రావు, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులు ఈ లిస్టులో ఉన్నారు. వీరందరిపై కేసులు నమోదు కావడంతో సినిమా ఇండస్ట్రీలో కలవరం మొదలయింది.