దేశ రాజధాని నగరంల ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో హోలీ పండుగ రోజున దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. తరుణ్ అనే 26 ఏళ్ల యువకుడిని కొంత మంది కిరాతకంగా చంపారు. అయితే ఉత్తమ్ నగర్ హత్య కేసు నిందితుల ఇళ్ల కూల్చివేతలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని (MCD) హెచ్చరించింది. జస్టిస్ అమిత్ బన్సాల్ ఈ మేరకు స్టే ఇచ్చారు.
హోలీ వేడుకల్లో తరుణ్ భూటోలియా అనే యువకుడి హత్య జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి తల్లులు షహనాజ్, జరీనా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తమ ఇళ్లను అక్రమంగా కూల్చివేస్తున్నారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి నేటి సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 10:30 గంటల వరకు ఎలాంటి కూల్చివేతలు జరగకూడదని స్పష్టం చేశారు.
మార్చి 8వ తేదీన ఎంసీడీ అధికారులు ఒక ఇంటిలోని కొన్ని భాగాలను ఇప్పటికే తొలగించారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ముందస్తు నోటీసులు లేకుండా ఈ చర్యలు చేపట్టడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు విచారణ ఎదుర్కొంటున్నారనే కారణంతో శిక్షాత్మక చర్యగా ఇళ్లను కూల్చడం సరికాదని వారు వాదించారు. ఆ ప్రాంతంలో అనేక ఇళ్లు ఉన్నప్పటికీ కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక దురుద్దేశం ఉందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.
ఏళ్ల తరబడి మున్సిపల్ పన్నులు, విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నామని జరీనా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో తాము లేమని ఆమె వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది దివ్యేష్ ప్రతాప్ సింగ్ కోర్టుకు విన్నవించారు. ఆర్టికల్ 14, 21, 300A ప్రకారం పౌరులకు ఉన్న హక్కులను అధికారులు కాలరాస్తున్నారని తెలిపారు.
ఈ ఘటనకు మతపరమైన రంగు పులుముకోవడంతో నగరంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బుధవారం ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరగనుంది. అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ప్రతివాదుల తరపు న్యాయవాదులు సమయం కోరడంతో విచారణను వాయిదా వేశారు.
ALSO READ: Constable Dies: మంగళగిరిలో విషాదం.. పరుగు పందెంలో హెడ్ కానిస్టేబుల్ మృతి