Constable Dies: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో భాగంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని కొలసాని వెంకటేశ్వరరావుగా గుర్తించారు. ఆయన మంగళగిరి ఆరో బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఉదయం బెటాలియన్ సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్‌నెస్ శిక్షణలో భాగంగా 3.2 కిలోమీటర్ల పరుగు పందెం పోటీని నిర్వహించారు. ఈ పోటీలో వెంకటేశ్వరరావు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే, పరుగు ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పరుగు పెడుతున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయినట్లు సహచర సిబ్బంది తెలిపారు.
వెంకటేశ్వరరావు పడిపోవడాన్ని గమనించిన తోటి పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. విధి నిర్వహణలో చురుగ్గా ఉండే వెంకటేశ్వరరావు ఇలా ఆకస్మికంగా మరణించడం బెటాలియన్‌లో విషాద ఛాయలు నింపింది. ఆయన మృతి పట్ల తోటి పోలీసులు, ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read:పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!