AP : క్రికెట్ క్రికెట్ క్రికెట్. బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్. కుర్రాళ్లు దారి తప్పుతున్నారు. క్రికెట్‌కు బెట్టింగ్ మిక్స్ చేసి.. లైఫ్‌ను రిస్క్‌లో పడేస్తున్నారు. ఐపీఎస్ క్రేజ్ అంతాఇంతా కాదు. బాల్ బాల్‌కు మజా. షాట్ షాట్‌కు కిక్కు. మా టీమ్ గొప్పంటే, మా టీమ్ గొప్ప. మా ప్లేయర్ హీరో అంటే.. కాదు మా ప్లేయరే తోపు అంటూ గొడవలు కూడా పడుతున్నారు. ఇంత వరకూ బానే ఉంది కానీ.. ఆ అభిమానం హద్దు మీరినప్పుడే తేడా కొడుతోంది. మరోపైపు, బెట్టింగ్‌లతో లైఫ్ అంతా డ్యామేజ్ చేసుకుంటున్నారు.
క్రికెటా? బెట్టింగా?
మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ఓసారి గమనించండి. రెప్ప కొట్టకుండా మొబైల్‌లో ఐపీఎల్ చూస్తుంటారు చాలామంది. వారంతా కేవలం క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే అనుకుంటే పొరబాటే. అందులో బెట్టింగ్ రాయుళ్లే ఎక్కువ. అందుకే అలా ఉత్కంఠగా మ్యాచ్ చూస్తుంటారు. నెక్స్ట్ బాల్‌కు సిక్సా? అవుటా? ఆ టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది? ఎన్ని వికెట్లు పడగొడుతుంది? ఏ బ్యాటర్ ఎంత స్కోర్ చేస్తాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు? ఇలా కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం అన్నట్టు సాగుతుంది బెట్టింగ్ రాయుళ్ల యవ్వారం.
బెట్టింగ్‌లతో బతుకులు ఆగం..
మొదట్లో డబ్బులు వచ్చినట్టే అనిపిస్తుంది. అప్పుడప్పుడు వస్తుంటాయ్, చాలాసార్లు పోతుంటాయ్. మనీ వచ్చినప్పుడు చాలా సంబరపడిపోతారు. ఇంకా ఎక్కువ సొమ్ములు పెడతారు. మొత్తం ఫసక్ అంటుంది. ఆ పోయిన డబ్బులు ఎలాగైనా రికవరీ చేయాలని పంతానికి పోతారు. మరికొంత మనీ పెడతారు. అదికూడా పోతుంది. అరే, పెద్ద లాసే వచ్చిందే.. ఇప్పుడెలా? ఎలా రికవరీ చేయాలి? అని తెగ ఇదైపోతారు. బయటి నుంచి అప్పులు తెస్తారు.. అవి కూడా ఖతం. ఆ అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు చేస్తారు. ఎన్నిసార్లు బెట్టింగ్ పెట్టినా.. చివరాఖరికి మాత్రం లాస్ మాత్రమే మిగులుతుంది. ఈలోగా ఐపీఎల్ సీజన్ ముగిసే సరికి.. మనోళ్లకి 10, 20 లక్షల వరకు అప్పు అవుతుంది. బైక్ కుదవపెట్టడం, గోల్డ్ అమ్మేయడం, ఇల్లు తాకట్టు పెట్టడం, పొలం పేపర్లు పెట్టి అప్పు చేయడం.. ఇలా ఆస్తులన్నీ పోగొట్టేసిన బెట్టింగ్ రాయుళ్లు ఊరుకు 10మంది ఉంటారు. ప్రతీ సీజన్‌లో వందల కోట్ల బెట్టింగ్ దందా నడుస్తుందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఎవరైనా బెట్టింగ్ పెట్టి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు.
అప్పుల ఊబిలోకి..
ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది. ఉన్నదంతా పోగొట్టుకుంటారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోతారు. ఇప్పుడెలా? బయటపడేదెలా? కొందరు ఊరు వదిలి పారిపోతుంటారు. మరికొందరు అప్పులు ఇచ్చిన వాళ్ల టార్చర్ పడలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకొందరు దొంగతనాలు గట్రా చేస్తున్నారు. అలాంటి కేసులోనే ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీసులు.
బెట్టింగ్‌ల కోసం చోరీలు..
క్రికెట్ బెట్టింగ్‌ల కోసం డబ్బులు లేక దొంగతనాలు చేశారు ఆ ఐదుగురు నిందితులు. తంబళ్లపల్లె అంగళ్ల దగ్గర గత నెలలో రెండు ఇళ్లల్లో దోపిడీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. గతంలోనూ వారు ఇలానే దొంగతనాలకు పాల్పడ్డారని తేల్చారు. క్రికెట్ బెట్టింగుల కోసమే ఇలా దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. ఐదుగురిలో ముగ్గురు పాత నేరస్తులుగా గుర్తించారు. వారి నుంచి 75 లక్షల నగదును రికవరీ చేశారు. వామ్మో.. 75 లక్షలు అంటే మాటలా? బెట్టింగ్ కంటే దొంగతనం దందానే బాగుందనుకున్నారేమో.