Siddipet News : పండుగ వేళ సరదాగా డ్యామ్ దగ్గరకు వెళ్లిన యువకుల సెల్ఫీ సరదా వారి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. మొత్తం ఏడుగురు యువకులు నీటిలో గల్లంతు కాగా.. వారిలో ఇద్దరు చివరి క్షణంలో బతికి బయటపడ్డారు. మిగతా ఐదుగురు యువకులు నీటిలో మునికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన.. సిద్ధిపేట జిల్లాలోని మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాం దగ్గర చోటుచేసుకుంది.
మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును చూసేందుకు ఏడుగురు యువకుల బృందంగా వెళ్లారు. నీటిలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి.. ఏడుగురు నీటిలో కొట్టుకుని పోగా.. అందులోనుంచి ఓ ఇద్దరు యువకులు మాత్రం బయటపడ్డారు.. ఈ ఘటనలో మిగతా ఐదుగురు నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. ఆచుకీ లభించని యువకులు ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17)లుగా పోలీసులు తెలిపారు.
యువకులంతా హైదరాబాద్ లోని హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో.. నీటిలో మృతదేహాల కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. సాగర్ డ్యామ్ చూసేందుకు వెళ్లిన యువకులంతా 20 ఏళ్ల లోపు వాళ్లే కావడంతో.. ఉత్సాహంగా సెల్పీల కోసం ప్రయత్నించి ప్రమాదాన్ని కొవితెచ్చుకున్నారంటున్నారు.
కాగా.. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన యుకులను సంఘటన గురించిన వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు.. వీరిని మృగాంక్(17), ఇబ్రహీం(20) లుగా తెలిపారు. ఈ ఇద్దరు సురక్షితంగానే ఉన్నారని, మిగతా వారి గల్లంతు తెలియాల్సి ఉందని చెబుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..
కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదురుగు యువకుల గల్లంతు విషయం తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గల్లంతైన యువకుల కోసం గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా అధికారులు జలాశయం దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలని, తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న మంత్రులు.. జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రమాదం కలచివేసిందన్న మంత్రులు.. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. పురోగతిని తెలుసుకున్నారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో ఫోన్లో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.