Dil Raju.. తెలంగాణ కల్చర్ పై ఇటీవల నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈవెంట్లో దిల్ రాజు(Dil Raju) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణలో పుట్టి తెలంగాణ కల్చర్ ను అవమానిస్తున్నాడు అంటూ చాలామంది ఈయనపై విమర్శలు గుప్పించారు. ఇవి కాస్త దిల్ రాజు వరకు చేరడంతో తాజాగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది.
క్షమించండి అని వేడుకుంటున్న దిల్ రాజు..
వీడియోలో దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. మొన్న ఈ మధ్య మేము నిజామాబాద్ లో “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఈవెంట్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాతో నాకున్న అనుబంధం కారణంగానే ఈ సినిమా ఈవెంట్ ను అక్కడ నిర్వహించాము. అప్పుడెప్పుడో ‘ఫిదా’ సినిమా సక్సెస్ మీట్ మాత్రమే నిర్వహించాము. నిజామాబాద్ జిల్లా వాసిగా.. అక్కడ ఈ ఈవెంట్ చేయాలని అనుకొని, అక్కడ ఈవెంట్ చేసాము. అయితే ఆ ఈవెంట్ లో మన కల్చర్ లో ఉండే దావత్ గురించి మటన్, తెల్లకల్లు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్లను అవమానించానని , తెలంగాణను హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్ లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చర్, మన దావత్ ను నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక, మన తెలంగాణ కల్చర్ దావత్ ను నాకు చేసుకోవాలని ఉంది. నేను మన తెలంగాణ కల్చర్ ను ఎంతగానో ప్రేమిస్తాను. దీనిని అర్థం చేసుకోకుండా కొంతమంది దీనిని సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హార్ట్ అయి ఉంటే.. నన్ను క్షమించండి. నా ఉద్దేశం అది కాదు అంటూ తెలిపారు.
తప్పుగా ప్రచారం చేస్తున్నారు..
ఇక అలాగే నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా సక్సెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏమిటంటే, మన తెలంగాణ కల్చర్ ను ఆ సినిమాలో చక్కగా చూపించాము. అది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసను పొందింది. ముఖ్యంగా అందులో భానుమతి క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయింది. అలాగే ‘బలగం’ సినిమా కూడా. ఈ సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలంతా కూడా ఈ సినిమాను మా సినిమా అని ఆదరించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తూ మాకు సపోర్ట్ గా నిలిచారు. తెలంగాణ వాసిగా, తెలంగాణను అభిమానించే నేను.. తెలంగాణను హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు” అంటూ దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో, వెంకటేష్ (Venkatesh) హీరోగా నటిస్తున్న చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఇటీవల నిజామాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాలు వస్తే.. తెలంగాణ ఆడియన్స్ లో పెద్దగా వైబ్ ఉండదు. ఇక్కడి వారు తెల్లకల్లు , మటన్ కి మాత్రమే వైబ్ ఇస్తారని , కానీ ఆంధ్ర ఆడియన్స్ సినిమాలకు వైబ్ ఇస్తారని దిల్ రాజు మాట్లాడారు. ఇక ఈ విషయాల పైనే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.