Sankranti Celebrations In India: సనాతన ధర్మంలో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు సూర్యుడుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఆ తర్వాత దానధర్మాలు చేస్తారు. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం చేయడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని సనాతన శాస్త్రాలలో ఉంది. అలాగే సమస్త పాపాలు నశిస్తాయని కూడా ప్రజలు నమ్ముతారు.
జనవరి 14 న సంక్రాంతి పండగను జరుపుకోనున్నాము. ఈ పండగను దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతిని వారి వారి ఆచారాల ప్రకారం జరుపుకుంటారు. మరి ఏ రాష్ట్రంలో సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో సంక్రాంతికి వివిధ పేర్లు:
మకర సంక్రాంతి (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ)
శిశుర్ సంక్రాంతి ( కాశ్మీర్)
తై పొంగల్( తమిళనాడు)
ఖిచ్ఢీ పర్వ్ ( యూపీ, బిహార్)
భోగాలి బిహు(అస్సాం)
లోహ్రీ (పంజాబ్)
పౌష్ సాంగ్క్రాంతి( బెంగాల్)
సుగ్గి హబ్బా (కర్ణాటక)
మకర చౌలా ( ఒడిశా)
మాఘి సంక్రాంతి ( మహారాష్ట్ర, హర్యానా)
మకర సంక్రాంతి రోజు సాధారణంగా జరుపుకునే కార్యక్రమాలు:
సంక్రాంతి సందర్భంగా గాలి పటాలు ఎగరవేస్తారు
భోగ మంటల సమయంలో జనపద పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.
వరి, చెరకు పంటలను కోసి ఇంటికి తెస్తారు.
పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
సూర్యుడి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు.
బెల్లం, నువ్వులతో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటారు.
మహారాష్ట్ర:
మకర సంక్రాంతిని మహారాష్ట్రలో సద్భావనకు చిహ్నంగా జరుపుకుంటారు. ఈ సమయంలో అందరూ ఓ చోట చేరి ప్రత్యేక హల్దీ, కుంకుమ వేడుకను జరుపుకుంటారు.
తమిళనాడు:
మకర సంక్రాంతి సందర్భంగా నాలుగు రోజుల వేడుకను తమిళనాడులో జరుపుకుంటారు. ముఖ్యంగా జల్లికల్లు అని పిలిచే ఎద్దుల పండగను కూడా వివిధ గ్రామాల్లో నిర్వహిస్తారు.
గుజరాత్ :
మకర సంక్రాంతిని గుజరాత్ లో ఉత్తరాయణ్ అని పిలుస్తారు. రెండు రోజుల పాటు ఈ పండగను ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. పండగ రోజు గాలిపటాలు ఎగరవేయడంతో పాటు ఈ సీజన్ లో లభించే కూరగాలతో చేసిన వంటకాలు చేసుకుంటారు. అంతే కాకుండా బెల్లంతో స్వీట్లు ప్రత్యేకంగా చేసుకుని తింటారు.
ఆంధ్రప్రదేశ్:
సంక్రాంతి పండగను ఏపీలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి వేడుకను ఇక్కడ 3 రోజలు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండగ. ఈ రోజు ఇంట్లోని పాత వస్తువులను మంటలో వేసి కాలుస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి ఈ రోజు కొత్త బట్టలు ధరించి విందుకు బంధువులను ఆహ్వానిస్తారు. ప్రత్యేకమైన పిండి వంటలు చేసుకుంటారు. అంతే కాకుండా ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. అంతే కాకుండా గాలి పటాలు ఎరవేస్తారు.కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, ఎద్దుల పందాలు కూడా నిర్వహిస్తారు. మూడవ రోజు కనుమ ఈ రోజు రైతులకు చాలా ప్రత్యేకమైనది. వీరి శ్రేయస్సును సూచించే పశువును పూజిస్తారు.
పంజాబ్:
సంక్రాంతికి ముందు రోజు రాత్రి ఇక్కడ లోహ్రీ జరుపుకుంటారు. ఈ సమయంలో సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. రైతులు పంటలు కోసం ఇంటికి తీసుకువస్తారు.
Also Read: సంక్రాంతి పండుగ వెనుక దాగిన విశేషాలివే.. ఆహా ఏమి వైభోగం!
కర్ణాటక:
మకర సంక్రాంతి రోజు కర్ణాటకలో వంటలను చేసుకుని పంచుకుంటారు. రైతులు వారి ఎద్దులు, ఆవులను రంగు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ఆ తర్వాత ఎద్దులతో పాటు నిప్పులపై నడుస్తారు.
కేరళ:
శబరిమల ఆలయానికి సమీపంలో ఉన్న మకర విళక్కు ఆకాశంలో కనిపించే సమయంలో సంక్రాంతి రోజు జనం వచ్చి జ్యోతిని దర్శించుకుంటారు. అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో మకర సంక్రాంతి రోజు వస్తాడని నమ్ముతారు.