Tirupati News: తిరుపతి ఫారెస్టులో మృతదేహాల కేసు గుట్టు వీడింది. గాదంకి టోల్‌ప్లాజా సమీపంలో అడవిలో వెలుగు చూసిన మృతదేహాల గుట్టు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతులంతా తమిళనాడుకు చెందినవారు. జయమాల(33), కళై సెల్వన్(37), కుమార్తెలు దర్శిని(9), వర్షిణి(3)గా గుర్తించారు. వీళ్లు మృతదేహాలు తిరుపతి అడవుల్లో కనిపించడానికి కారణమేంటి? అన్నది ఇప్పుడు తేలాల్సివుంది.
జయమాల భర్త వెంకటేశ్ తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని వీవోసీనగర్ ప్రాంతవాసి. అతడు కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య జయమాల పిల్లలు, జయమాల చిన్నమ్మ కొడుకు కళై సెల్వన్‌తో ఆ గ్రామంలో ఉండేవారు. వెంకటేశ్ కువైట్‌లో ఉంటూ భార్యకు రూ. 40 లక్షల వరకు డబ్బులు పంపించాడు. ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలో లేకపోవడంపై భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
తన భార్యతో కలిసి కళై సెల్వన్ డైలీ ఫైనాన్స్ చేసి ఈ డబ్బును దుర్వినియోగం చేశాడన్నది వెంకటేశ్ ఆరోపణ. కువైట్ నుంచి వచ్చిన వెంకటేష్.. కళై సెల్వన్‌పై చీటింగ్ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో తన భార్య, పిల్లలు, కళైసెల్వన్ కనిపించలేదని జులై 4న పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్డాడు వెంకటేశ్. ఆ తతంగం జరుగుతుండగా తిరుపతి అడవిలో వారి మృతదేహాలు బయటపడ్డాయి.
వారిది హత్యా? ఆత్మహత్యా? అనేది తేలాల్సి ఉంది. సోమవారం జయమాల భర్త వెంకటేశ్, ఆయన బంధువులు తిరుపతి పోలీసులను సంప్రదించారు. దీంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. గోతుల్లో పాతిపెట్టిన రెండు మృతదేహాలు దర్శిని, వర్షిణిలుగా గుర్తించాడు వెంకటేశ్. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
ALSO READ: రూ.300 కోసం ఆటో డ్రైవర్ ను హత్య చేసి, డెడ్ బాడీని
గత శనివారం తిరుపతి అడవిలో కుళ్ళిపోయిన రెండు మృతదేహాలను పశువుల కాపరులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాల గుట్టు అప్పటి నుంచి రోజుకో మలుపు తిరిగింది. చెట్టుకు వేలాడుతూ ఒకరు, సమీపంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
వీరికి కూతవేటు దూరంలో గుంతలో ఇద్దరు పిల్లల మృతదేహాలను కనుగొన్నారు. తవ్వడానికి ఉపయోగించిన పార, మద్యం సీసాలు, మొబైల్ ఫోన్ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. దీనికితోడు ఆసుపత్రి మెడికల్ స్లిప్‌లో తమిళనాడులోని తంజావూరుకు చెందిన కలై సెల్వన్ పేరు ఉంది.
దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణ నిమిత్తం వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణాల వెనుకున్న ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగా ఉందన్నారు పోలీసులు. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.