Hyderabad Crime: మానవత్వం అనేది మచ్చుకైనా లేదు ఆ కసాయికి.. అభం శుభం తెలియని ఆ చిన్నారి చేసిన నేరం ఏంటి? ఆడపిల్లగా పుట్టడమే ఆ చిన్నారి చేసిన నేరమా? కన్నతండ్రే ఆ పసిబిడ్డ పాలిట కాల యముడయ్యాడా? ఆ పసిపాపను అంతమొందించడానికి ఆ కసాయికి మనసెలా వచ్చింది. ఆడపిల్లను చంపడమే అతని సమస్యకు పరిష్కారమా?
సమాజంలో ఆడా.. మగా సమానంగా రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో మగవారికంటే.. ఆడవాళ్లే ముందున్నారు. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్న కొందరిలో మార్పు రావడం లేదు. ఆడపిల్ల పుట్టడమే పాపంగా భావిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని కట్టుకున్నవారిపట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తీవ్ర వేధింపులకు గురిచేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఆడపిల్ల లేనిదే సృష్టే లేదంటారు.. ఆడపిల్లలను బతకనిద్దాం.. సమాజంలో గౌరవం నిలుపుదాం.. ఆడపిల్లని చదివిద్దాం.. ఎదగినిద్దాం.. ఇంటికి వెలుగులు.. ఆడపిల్ల చిరునవ్వులు.. అంటూ ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు జరుపుతున్న కొందరికి బుద్ది మాత్రం మారడం లేదు. ఆడపిల్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. పసికందు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. మూడోసారి కూతురు పుట్టిందని 14 రోజుల పసికుందును గొంతు కోసి చంపాడో తండ్రి. పసికందును హత్య చేసి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. నిందితుడు నేపాల్‌కు చెందిన జగత్ గా గుర్తించారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు జగత్. ఇప్పటికే కూతురు ఉంది. ఇప్పుడు మరోసారి కూడా కూతురు పుట్టడంతో తీవ్ర అసహనంలో ఉన్నాడు జగత్. ఇదే విషయంపై భార్య గౌరీతో గొడవ పడుతున్నాడు. బుధవారం తెల్లవారుజామున చిన్నారిని బయటికి తీసుకెళ్లిన జగత్.. మానవత్వం మరిచి గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత సెవన్ టూంబ్స్ ఏరియాలో ఆ చిన్నారి మృతదేహాన్ని ఓ డస్ట్‌బిన్‌లో పడేశాడు.
చిన్నారి కనిపించకపోవడంతో భర్తను అడిగిన భార్య.. తనకేం తెలియదనడంతో సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలన్ని వెలుగులోకి వచ్చాయి. తానే చిన్నారిని హత్య చేశానని విచారణలో అంగీకరించాడు జగత్. నేపాల్‌కి చెందిన జగత్.. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
Also Read: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఇల్లాలు.. కొడుకు ఊహించని ట్విస్ట్!
పాపను చంపేసి పరారైన తండ్రి జగత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒక కూతురు ఉంది.. మరో కూతురు వద్దనుకుని చంపేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు జగత్. గతంలోనూ ఒక కుమారుడికి ఇలానే చంపేశాడని అతని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. కుటుంబసభ్యుల నుంచి తనకు అలాంటి సమాచారం రాలేదని అంటున్నారు పోలీసులు.