Telangana Student Dead: అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో.. తెలంగాణకు చెందిన విద్యార్ధి మృతి చెందాడు. ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్.. 2023లో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ మాస్టర్స్ కోర్సు కొనసాగిస్తూ, పార్ట్‌టైమ్‌గా ఒక హెల్త్‌కేర్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.
దుండగుల కాల్పుల్లో మృతి
స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున డల్లాస్‌లోని నార్త్ మాక్‌ఆర్థర్ బులేవార్డ్ ప్రాంతంలో జరిగింది. ఓ షాపింగ్ సెంటర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న చంద్రశేఖర్‌కు బుల్లెట్ తగలడంతో.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని.. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందాడు.
కారణాలు ఇంకా స్పష్టత రాలేదు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది రాబరీ అటెంప్ట్‌లో భాగంగా జరిగిన కాల్పులుగా భావిస్తున్నారు. నిందితులు ఘటన అనంతరం పారిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు సేకరించి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియన్ కాన్సులేట్ కూడా ఘటనపై అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
హైదరాబాదులో విషాద వాతావరణం
చంద్రశేఖర్ మృతిచెందిన వార్త తెలిసిన వెంటనే.. ఆయన స్వస్థలం ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ నగర్‌లో విషాద వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు ఆ వార్త విని కన్నీటి పర్యంతమయ్యారు.
హరీశ్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శ
బీఎన్ రెడ్డి నగర్ లో ఉన్న బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి మాజీమంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఉన్నత స్థానంలో ఉంటాడనుకున్న కుమారుడు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కు పోతోందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతదేహం రవాణా చర్యలు ప్రారంభం
చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి.. టెలంగాణ ఎన్ఆర్ఐ విభాగం, అమెరికా ఇండియన్ ఎంబసీ చర్యలు ప్రారంభించాయి. భారత రాయబార కార్యాలయం స్థానిక ఎన్‌జీఓల సహాయంతో రవాణా ప్రక్రియను వేగవంతం చేస్తోంది. వచ్చే రెండు రోజుల్లో మృతదేహం హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
విద్యార్థుల భద్రతపై ఆందోళన
ఈ ఘటనతో అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ సంఘటన మరింత కలవరపెడుతోంది. విద్యార్థుల భద్రతకు సంబంధించి అమెరికా విశ్వవిద్యాలయాలు, కాన్సులేట్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలుగు అసోసియేషన్లు కోరాయి.
Also Read: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్
అమెరికాలో దుండగుల కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ మృతి చెందడంపై.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు.. అన్ని విధాలా సహకారం అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.