Chain Snatching Gang Arrest: విశాఖలో సంచలనం రేపిన వరుస చైన్ స్నాచింగ్ కేసులను విశాఖ పోలీసులు ఛేదించారు. కరుడుగట్టిన బావేరియా ముఠా సభ్యుడిని అరెస్ట్ చేశారు.
ఏడు చోట్ల వరుస దొంగతనాలు
సెప్టెంబర్ 17న విశాఖలో ఏడు చోట్ల వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. ఈ ఘటనలకు సంబంధించి యూపీకి చెందిన ధర్మేంద్రను సినీ పక్కీలో అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. ఖాకీ మూవీలో కార్తీ ఇలాగే దొంగల ముఠాను పట్టుకోడానికి వేరే రాష్ట్రానికి వెళ్తాడు. అక్కడ అలాగే దాడి చేస్తారు. మమ్ముటి సీబీఐ 5 మూవీలో కూడా అంతే.. దొంగలు ఉండే ప్రాంతానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే.. అక్కడ పోలీసులను రౌండ్ చేసి దాడి చేస్తారు.
తాజాగా ఇదే తరహాలో ముఠా సభ్యుడు ధర్మేంద్రను అరెస్ట్ చేసే క్రమంలో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విశాఖ పోలీసులు యూపీకి వెళ్లి, షామిలీ జిల్లాలోని అలాఉద్దిన్‌పూర్ గ్రామంలో ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆ సమయంలో గ్రామస్థులు పోలీసులను అడ్డుకున్నారు. స్థానికులు దొంగను అరెస్ట్ చేయకుండా అడ్డుపడటమే కాకుండా, కర్రలతో ఏపీ పోలీసులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ, చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ డివిజన్ బృందం ధర్మేంద్రను అదుపులోకి తీసుకుంది.
ముఠా దొంగలపై భారీ కేసులు
పోలీసులు అరెస్ట్ చేసిన ధర్మేంద్ర వద్ద నుంచి ₹70,000 నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దొంగతనంలో ఉపయోగించిన వాహనం ఇదే అని నిర్ధారించారు. క్రైమ్ DCP లతామాధురి తెలిపిన వివరాల ప్రకారం, ధర్మేంద్రపై ఇప్పటికే 24 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇంకా ముగ్గురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆమె వెల్లడించారు.
Also Read: నకిలీ మద్యం కేసులో.. టీడీపీ నేత సురేంద్ర బాబు అరెస్ట్
ప్రజలకు హెచ్చరిక
ఈ నేపథ్యంలో పోలీసులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు విలువైన నగలు ధరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.