Cough Syrup: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో దగ్గు మందు వికటించి 11 మంది పిల్లలు మరణించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. డైథిలిన్ గ్లైకాల్ (DEG) కాంబినేషన్ ఉన్న సిరప్ లను చిన్నారులకు సిఫార్సు చేయొద్దని సూచించింది.
తమిళనాడు కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీసన్ ఫార్మా ఈ ఏడాది మే నెలలో తయారు చేసిన దగ్గు మందు ‘కోల్డ్‌రిఫ్’ ను వాడొద్దని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పిల్లల మరణానికి ఈ దగ్గు సిరప్ వినియోగంతో సంబంధం ఉందని నివేదికల నేపథ్యంలో డీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాచ్ SR-13 కు చెందిన సిరప్ లో కిడ్నీల వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) అనే కలుషితాలు ఉండే అవకాశం ఉందనే విషయంపై కేంద్రం దర్యాప్తు చేస్తుంది.
జలుబు, జ్వరం, దగ్గు నివారణకు వినియోగించే పారాసెటమాల్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌ఫెనిరమైన్ మలేట్ సిరప్ లలో కలుషిత డీఈజీ కలిసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బ్యాచ్ సిరప్ లను ఎవరైనా కలిగి ఉంటే వెంటనే డీసీఏ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969 ద్వారా తెలియజేయాలని డీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.
కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ బ్యాచ్ సిరప్ లను గుర్తించి, వాటిని సీజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సిరప్ ల సరఫరాను తక్షణమే నిలిపివేయాలని మందుల షాపులు, హోల్‌సేల్ వ్యాపారులు, ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని ఆదేశించింది. ఎవరైనా ఈ సిరప్ లను సిఫార్సు చేసినా, షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నా.. డీసీఏకు తక్షణమే తెలియజేయాలని కోరింది.
మధ్యప్రదేశ్ చింద్వారాలో దగ్గు సిరప్ తాగిన 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దగ్గు సిరప్ ను పిల్లలకు సిఫార్సు చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున వైద్యుడు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల్లో ఎక్కువ మందికి ఈ వైద్యుడే దగ్గు సిరప్ సిఫార్సు చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read: Konda Surekha Grandson: చిచ్చర పిడుగు.. ఔరా అనిపిస్తున్న మంత్రి కొండా సురేఖ మనవడు..
ఈ సిరప్‌ను తయారు చేస్తున్న తమిళనాడు శ్రీసన్ ఫార్మాపై కేసు నమోదు అయింది. ఈ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ ను తనిఖీ చేయగా అందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని గుర్తించారు. ఇది అత్యంత విషపూరితమైనదిగా దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.