కలికిరి రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం.. అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు యువకుల అకాల మరణం వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చగా, రైల్వే పట్టాల వద్ద భద్రతా నిబంధనలు ఎంత అవసరమో మరోసారి రుజువైంది.
Train Accident: అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే సిబ్బందితో జరిగిన వాగ్వాదం అనంతరం ఇద్దరు వ్యక్తులు పట్టాలపైకి వెళ్లి మద్యం సేవిస్తూ కూర్చున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకరు గంధం ముని కుమార్‌గా గుర్తించారు. ఆయన సోమల మండలం ఇరికి పంట గ్రామానికి చెందిన వ్యక్తి. రెండో వ్యక్తి జి. వీరభద్రయ్య బాబు, పీలేరు నియోజకవర్గంలోని కలికిరి క్రాస్ రోడ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. ఇద్దరూ బుధవారం రాత్రి కలికిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో మద్యం సేవించి, రైల్వే సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.
స్టేషన్‌లో అనుచితంగా ప్రవర్తించడంతో రైల్వే సిబ్బంది వారిని హెచ్చరించారు. దీంతో మాటామాటా పెరిగి గొడవగా మారింది. సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పలుమార్లు హెచ్చరించినా వారు వినిపించుకోలేదని తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ స్టేషన్‌కు సమీపంలోని పట్టాలపైకి వెళ్లి అక్కడే కూర్చొని మద్యం సేవించడం మొదలుపెట్టారు..
ఈ సమయంలోనే ఆ మార్గంలో వేగంగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు.. పట్టాలపై కూర్చుని ఉన్న వారిని ఢీకొట్టిందని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు ఢీకొటిటడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది హుటాహుటిన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. అర్థరాత్రి కత్తిపోట్ల కలకలం, ఓ వ్యక్తి హత్య