Karnataka Bank Robbery : కర్ణాటక రాష్ట్రంలో వరుస దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల ఏటీఎంలో డబ్బులు నింపే వ్యాన్ పై కాల్పులు జరిపి సొమ్ములు దోచుకెళ్లిన దుండగులు.. ఈ రోజు ఏకంగా బ్యాంక్ లోకి తుపాకులతో చొరబడి భారీ చోరికి పాల్పడ్డారు. ఈ దోపిడీలో ఏకంగా రూ.15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల విలువైన నగదును పట్టుకెళ్లారు. రెండు రోజుల్లోనే వరుసగా భారీ దొంగతనాలు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
ఉల్లాల్ సమీపంలోని కోటేకర్ వ్యవసాయ సహకార బ్యాంకు కేసీ రోడ్ బ్రాంచ్‌లోకి ఆయుధాలతో చొరబడిన ఆరుగులు వ్యక్తులు.. రూ. 15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 5 లక్షల నగదును దోచుకెళ్లారు. బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించిన దోపిడీ దొంగల ముఠా సభ్యులు.. దోపిడి అనంతరం బూడిద రంగు ఫియట్ కారులో పరారైన్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దుండగులు, తుపాకులు, కత్తులతో బ్యాంకులోకి చొరబడ్డారు. ఆ సమయంలో బ్యాంకులో నలుగురు బ్యాంకు సిబ్బంది, ఓ టెక్నీషియన్ ఉండగా.. వారిని బెదిరించి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు లాకర్లు తెరవకపోతే చంపేస్తామని బెదిరించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకు సిబ్బంది లాకర్ ను ఓపెన్ చేశారు. దాంతో.. అందులోని విలువైన సొత్తును దొంగలు దోచుకెళ్లారు.
ఈ దొంగతనం విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఘటనా స్థలాన్ని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ సందర్శించారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఫోరెన్సిక్ నిపుణులు, కనైన్ స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. దోపిడీ సమయంలో, ముఠా గ్రౌండ్ ఫ్లోర్‌లోని బేకరీలో ఉన్న విద్యార్థుల బృందాన్ని బ్యాంకుకు దూరంగా ఉండమని హెచ్చరించింది. పోలీసులు సేకరించిన సాక్షుల వాంగ్మూలాల ప్రకారం వారు తమలో తాము కన్నడలో మాట్లాడుకున్నారని, అయితే బ్యాంకు సిబ్బందితో హిందీలో సంభాషించారని వెల్లడించారు.
అయితే.. ఈ దొంగతనం జరిగిన సమయంలోనే బ్యాంకులోని సీసీ టీవీలు పనిచేయకుండా రిపేర్ కి వచ్చాయి. ఆ కారణంగానే.. టెక్నీషియన్ సైతం దొంగలకు చిక్కాడని చెబుతున్నారు. దొంగలు వెళ్లేటప్పుడు.. టెక్నీషియన్ చేతికున్న వేలి ఉంగరాన్ని సైతం బలవంతంగా లాకెళ్లారు. దాంతో.. బాధితుడు లబోదిబోమంటూ ఆందోళన పడుతున్నాడు. వాస్తవానికి కేసి రోడ్ జంక్షన్ చాలా రద్దీగా ఉంటుంది. కానీ వారాంతం కారణంగా శుక్రవారం నాడు హడావిడి తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమే దొంగలకు బాగా కలిసొచ్చింది అని చెబుతున్నారు. వారు ముందస్తు ప్రణాళికతో దోపిడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర దర్యాప్తు బృందాలు ఈ భారీ దోపిడిని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులు పారిపోయిన గ్రే కలర్ ఫియట్ కారు ఎటువైపు వెళ్లింది అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారును గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు.. అక్కడి నుంచి బయటకు వెళ్లే అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టి, సోదాలు నిర్వహిస్తున్నారు.
Also Read : అఫ్జల్‌గంజ్‌లో బీదర్ ఏటీఎం దొంగలు కలకలం.. ట్రావెల్ ఏజెంట్‌పై కాల్పులు
ఈ ఘటనపై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. జనవరి 17న ఉదయం 11:30-12:30 గంటల మధ్య కోటేకర్‌లోని సహకారి సంఘ బ్యాంక్‌లో సాయుధ దోపిడీ జరిగినట్లు అందులో తెలిపారు. ఇందులో పాల్గొన్న వాళ్లంతా 25-35 ఏళ్ల యువకులని వెల్లడించిన పోలీసులు, 5, 6 గురు ముసుగులు ధరించి, పిస్టల్, కత్తి సహా మారణాయుధాలు తీసుకుని బ్యాంకులోకి ప్రవేశించినట్లు తెలిపారు.