Wife and Husband Incident: కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లా తొదలబాగి గ్రామంలో అనుమానం అనే మహమ్మారి ఒక నిండు సంసారంలో చిచ్చు పెట్టింది. 31 ఏళ్ల ఉమేష్, 26 ఏళ్ల లక్ష్మీబాయి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మీబాయి అందంగా ఉండటం, ఆమె పొడవైన జుట్టును పూలతో అలంకరించుకోవడం చూసి ఉమేష్ ఓర్వలేకపోయేవాడు. తన భార్య అందాన్ని చూసి పరాయి పురుషులు ఆకర్షితులవుతున్నారనే వక్ర బుద్ధితో ఆమెను నిత్యం వేధించేవాడు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఉమేష్, భార్యతో మరోసారి తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగాడు. కోపంతో ఊగిపోయిన అతడు, చెరకు నరికే మచ్చుకత్తిని చూపిస్తూ ఆమెను ప్రాణభయానికి గురిచేశాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ, బలవంతంగా లక్ష్మీబాయి శిరోజాలను రేజర్‌తో పూర్తిగా గీసేసి గుండు చేశాడు. అందంగా ఉంటేనే కదా ఇతరులు చూస్తారు అనే ఉన్మాదంతో అతను చేసిన ఈ పని స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
బాధితురాలి రోదనలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. లక్ష్మీబాయి పడుతున్న మానసిక, శారీరక వేదనను చూసి చలించిపోయిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహిళా సంఘాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. కేవలం జుట్టు విషయంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అతనిలోని మానసిక వైకల్యానికి పరాకాష్ట అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దారుణ ఘటన.. యువ వ్యాపారవేత్తను.. హెల్మెట్లతో కొట్టిచంపిన డెలివరీ బాయ్స్!
ఫిర్యాదు అందుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు ఉమేష్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమెకు తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్న పోలీసులు, నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గృహ హింస, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.