Delhi Shocker: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువ వ్యాపారవేత్తను ముగ్గురు డెలివరీ బాయ్స్ హత్య చేశారు. హెల్మెట్లతో తలపై పదే పదే కొట్టి ప్రాణాలు బలిగొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. ఇద్దరు డెలివరీ బాయ్స్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి తండ్రి పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
జనవరి 3 రాత్రి వ్యాపారవేత్త శివం గుప్తా (36)పై దాడి జరిగింది. డెలివరీ బాయ్స్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 3వ తేదీ రాత్రి కన్నాట్ ప్రాంతంలోని ఫుట్ పాత్ పై ఓ వ్యక్తి గాయపడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న శివం గుప్తాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
జనవరి 4న శివం గుప్తాను మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత అతడు కోలుకుంటాడని కుటుంబ సభ్యులు, వైద్యులు భావించినప్పటికీ.. జనవరి 19న అతడి ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దిల్లీలోని పహార్ గంజ్ లో రెండు దుకాణాలను నడుపుతున్న శివం తండ్రి అనిల్ కాంత్ గుప్తా.. తన ఏకైక కుమారుడ్ని చంపిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
Also Read: Telangana Tourism: తెలంగాణ టూరిజం శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ప్రైవేటు టెండర్లు..?
జనవరి 2 సాయంత్రం తన కుమారుడు పార్టీ ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడని అనిల్ కాంత్ గుప్తా తెలిపారు. ఆ తర్వాత పదే పదే ఫోన్ చేసినప్పటికీ అతడి నుంచి స్పందన రాలేదని పేర్కొన్నారు. కొద్ది సేపటి తర్వాత తన కొడుకు ఆస్పత్రిలో ఉన్నట్లు పోలీసులు కాల్ చేసి చెప్పారని వాపోయారు. అయితే శివం గుప్తాకు డెలివరీ బాయ్స్ కు మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. దాడి జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు డెలివరీ బాయ్స్ ను అదుపులోకి తీసుకున్నామని.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Also Read: Viral Video: భర్తను చావగొట్టిన భార్య.. గుండెలపై కూర్చొని పిడిగుద్దులు.. అదేం కొట్టుడురా నాయనా!