Karnataka News: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఈ కిరాతక హత్య స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. పదేళ్ల క్రితం నాటి పాత కక్షను మనసులో పెట్టుకున్న ఒక యువకుడు, సమయం కోసం వేచి చూసి అత్యంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్న తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
పదేళ్ల క్రితం మొదలైన పగ
ఈ దారుణానికి ప్రధాన కారణం ఒక పాత వివాదం. బసడోణి గ్రామానికి చెందిన బసప్ప అనే వ్యక్తి, సుమారు పదేళ్ల క్రితం నిందితుడైన ఈరయ్య (28) తల్లిని తన వెంట తీసుకెళ్లిపోయాడు. వారిద్దరూ మహారాష్ట్రలోని కొల్హాపురంలో నివసించసాగారు. తన తల్లిని దూరం చేశాడన్న కోపం, అవమానం ఈరయ్య మనసులో బలమైన ద్వేషంగా మారింది. ఎలాగైనా బసప్పను అంతం చేయాలని అతను గత పదేళ్లుగా అతని కోసం వేచి చూస్తూ వచ్చాడు.
పథకం ప్రకారం దాడి
కొద్దిరోజుల క్రితం ఈరయ్య తన తల్లిని కొల్హాపురంలోనే వదిలిపెట్టి, తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నాడు. బసప్ప కదలికలపై నిఘా ఉంచిన ఈరయ్యకు, అతను హొలికట్టి ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్‌తో సోమవారం రాత్రి వేటకత్తితో బసప్పపై దాడి చేశాడు. అతి దారుణంగా.. కసితీరా.. దాదాపు 16 సార్లు కత్తితో పొడిచాడు.. దీంతో బసప్ప అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు.
సెల్ఫీతో రాక్షసానందం
హత్య చేసిన తర్వాత ఈరయ్యలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం గమనార్హం. రక్తంతో తడిసిన బసప్ప మృతదేహం ఛాతీపై కాలు పెట్టి నిలబడి, గర్వంగా సెల్ఫీ తీసుకుని తన రాక్షసానందాన్ని చాటుకున్నాడు. చంపిన అనంతరం అతనే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడం విశేషం. పాత కక్షే ఈ దారుణానికి పురికొల్పిందని ప్రాథమిక విచారణలో తేలింది.
Also Read: ఆ ఫోటోలు ఎంత పని చేశాయి.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఏం చేశాడంటే
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న సవదత్తి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ఈరయ్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు. ఈ హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా కేవలం పాత కక్షతోనే చేశాడా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.