Kukatpally Kaithalapur Suicide Case: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్న స్రవంతి అనే మహిళ, తన ఇద్దరు కన్న బిడ్డలను కిరాతకంగా చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిండు సంసారాన్ని చిన్నాభిన్నం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే కూకట్‌పల్లి పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, భర్త ప్రవీణ్ తో గత కొంతకాలంగా సాగుతున్న గొడవలే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. నిత్యం జరుగుతున్న గృహ కలహాల నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన స్రవంతి, తన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును ఆలోచించకుండా వారిని అంతం చేసి, తాను కూడా తనువు చాలించింది. మృతురాలు స్రవంతి స్వగ్రామం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండా కాగా, ఆమె భర్త ప్రవీణ్ స్వగ్రామం అదే మండలంలోని బోడమాణిక్య తండా. బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఈ కుటుంబం ఇలా విషాదాంతం అవ్వడం స్థానికులను కలచివేసింది.
స్రవంతి రోడ్డు పక్కన ఒక చిన్న ఫుడ్ కోర్ట్ నడుపుతూ తన పిల్లలను హాస్టల్‌లో ఉంచి చదివించుకునేది. ప్రవీణ్ తీరుతో విసిగిపోయిన ఆమె విడాకులు కావాలని కోరింది. దీనిపై వరంగల్‌లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఆ సమయంలో ప్రవీణ్ తప్పు ఒప్పుకుని, రెండో భార్యను వదిలేసి స్రవంతితోనే ఉంటానని నమ్మబలికాడు. కానీ, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్లీ తన పాత పద్ధతినే కొనసాగిస్తూ స్రవంతిని శారీరకంగా, మానసిక నరకయాతనకు గురిచేసేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి కూడా వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు సమాచారం.
ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్రవంతి తన ఇద్దరు పిల్లలను రేకుల షెడ్డుకున్న ఐరన్ సీలింగ్‌కు ఉరివేసి చంపి, తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం ప్రవీణ్ వచ్చి చూసేసరికి ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘోర వార్త విన్న స్రవంతి తల్లిదండ్రులు, బంధువులు తండాలోని ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. మంటలు ఎగిసిపడటంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. “మా బిడ్డను, మనవళ్లను పొట్టనబెట్టుకున్న ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కన్నతల్లి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారులను చూసి కాలనీవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. గృహ హింస, కుటుంబ సమస్యలు ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.
Read Also: సోషల్ మీడియాలో విద్వేషం చిమ్మితే అంతే.. తెలంగాణ సర్కార్ సరికొత్త చట్టం