Kurnool Bus Accident: కర్నూలు బస్సు దగ్ధం దుర్ఘటనలో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన బైక్ ను నడిపిన శివశంకర్ పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివశంకర్ పై ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్ నిర్లక్ష్యం కారణంగానే బైక్ డివైడర్‌ను ఢీకొట్టిందని తన ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నాడు.
ప్రమాదానికి ముందు తాను, శివ శంకర్ మద్యం సేవించినట్లు ఎర్రిస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల బైక్ డివైడర్ ను ఢీకొట్టిందని తెలిపారు. శివశంకర్ స్పాట్ లో చనిపోగా, తాను గాయాలతో బయట పడ్డానని చెప్పుకొచ్చారు. శివశంకర్ మృతదేహాన్ని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే, తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో.. బైక్ రోడ్డు మధ్యలో పడిందన్నారు. కాసేపటికి బస్సు బైకును లాక్కెళ్లిందని ఎర్రిస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని వివరించారు.
కర్నూలు బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక సమర్పించింది. దీని ప్రకారం శివ శంకర్ మృత దేహం నుంచి సేకరించిన నమూనాల్లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో మద్యం తాగి వాహనం నడిపినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. శివశంకర్, ఎర్రిస్వామికి సంబంధించిన మరో సీసీటీవీ వీడియో బయటపడింది. ప్రమాదానికి ముందు పెద్దటేకూరులోని ఓ వైన్స్ లో గురువారం రాత్రి 7 గంటలకు ఒకసారి, 8.25 మరోసారి వీరిద్దరూ మద్యం కొనుగోలు చేసినట్లు రికార్డు అయింది. ఈ సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతుంది.
కర్నూలు దుర్ఘటనకు సంబంధించి వెలుగులోకి మరో కొత్త వీడియో..
పెద్దటేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసిన శివ శంకర్
గురువారం సాయంత్రం 7 గంటలకు, మళ్లీ రాత్రి 8.25 గంటలకు మద్యం కొనుగోలు
సీసీటీవీలో రికార్డు అయిన మద్యం కొనుగోలు దృశ్యాలు https://t.co/bek7xZYDLW pic.twitter.com/GFCPQ9aRwm
— ChotaNews App (@ChotaNewsApp) October 26, 2025
కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నంద్యాల జిల్లాలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే 66 కేసులు నమోదు చేసి రూ. 28,400 జరిమానా విధించారు. పల్నాడు జిల్లాలో 36 కేసులు పెట్టి రూ. 2,50,700 ఫైన్ విధించారు. ప్రకాశం జిల్లాలో 34 కేసులు పెట్టి రూ. 89,810 జరిమానా విధించారు. తిరుపతి జిల్లాలో 25 కేసులు నమోదు చేసి రూ. 2,40,000 జరిమానా విధించారు. చిత్తూరు జిల్లాలో 8 కేసులు, కర్నూలు జిల్లాలో 14 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 42 కేసులు పెట్టి, నిబంధనలు ఉల్లంఘించిన ఓ బస్సును సీజ్ చేశారు.
Also Read: Maharashtra News: భార్యాభర్తల మధ్య గొడవ.. కోపంతో ఫారెస్టులోకి, కవలల గొంతు కోసిన తండ్రి
కర్నూలు బస్సు దగ్ధం కేసులో మృతి చెందిన వారిలో 18 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అందించారు. డెట్ సర్టిఫికెట్లు, ఇతర ప్రక్రియను కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.