Uttar Pradesh Crime: అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నారు. ఆ ఉచ్చులో పడి పిల్లలను చంపేస్తున్న ఉదంతాలు సైతం అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి బయటపడింది. మంత్ర విద్యలో పడిన ఆ తల్లి, తన ఇద్దరు పిల్లలను హత్య చేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.
యూపీలో దారుణం, మూడనమ్మకాలు
ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్‌లోని సెమ్రి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి తన ఇద్దరు పిల్లలను చంపేసి, ఆ తర్వాత ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం భర్త ఇంటికి వచ్చేసరికి వారిని విగతజీవులుగా చూసి షాకయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐదేళ్ల కిందట హరిశ్చంద్ర-సంగీతా దేవికు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివన్ష్‌కు మూడేళ్లు, శుభంకర్ 18 నెలలు వయస్సు ఉంది. హరిశ్చంద్ర ఆ గ్రామంలో సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నాడు. రెండు నెలల తర్వాత సంగీత దేవి తన తల్లిదండ్రుల ఇంటి నుండి భర్త వద్దకు వచ్చింది.
పిల్లలను చంపేసి, తల్లి కూడా ఆత్మహత్య
పల్లెటూరు అనగానే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. సంగీతాదేవి వాటికి ఆకర్షితురాలైంది. మంత్ర విద్యకు నేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బ్లాక్‌మేజిక్ పూజలు గురించి చెప్పనక్కర్లేదు. ఒక్కసారి ఆ ఉచ్చులో పడితే బయటకు రాలేదు. ఫ్యామిలీని సైతం సర్వనాశనం చేస్తోంది.
సంగీత విషయంలో అదే జరిగింది. శనివారం ఉదయం పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు ఆమె భర్త. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలకు నోటిలో గుడ్డ కుక్కి అత్యంత దారుణంగా చంపేసింది. ఆ తర్వాత ఆమె వెదురు తాడుతో ఇంట్లోనే ఉరి వేసుకుంది.
ALSO READ: ఆ గ్యాస్ గీజర్ అక్కాచెల్లెళ్లను చంపేసింది
సాయంత్రం ఐదు గంటలకు సంగీత భర్త ఇంటికి వచ్చాడు. తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉంది. ఫోన్ చేస్తే.. స్విచ్చాఫ్ అని వచ్చింది. అరగంట దాటింది.. దాదాపు గంట కాబోతోంది. తలుపు గట్టిగా కొట్టినా తెరవలేదు. చివరకు ఇంటి వెనుక కిటికీలోంచి చూశాడు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. పిల్లల నోళ్లలో గుడ్డలు కుక్కి ఉన్నాయి. భార్య ఉరేసుకుని కనిపించడం చూసి షాకయ్యాడు.
ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంగీత తరచుగా తన మొబైల్ ఫోన్‌లో మంత్ర విద్యల గురించి వినేదని ఆమె భర్త చెప్పాడు. అజంగఢ్‌ను చాలాసార్లు సందర్శించిందని, అక్కడి తాంత్రికులను కలిసేదని తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ మహిళ మూఢనమ్మకానికి అలవాటు పడి, ఈ కారణంగా పిల్లలను చంపి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.